కరోనా దెబ్బకు దాదాపుగా అన్ని వ్యవస్థలు కుదేలవుతున్నాయి. లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థను ఎక్కడికక్కడ స్తంభింపజేయడంతో ప్రభుత్వ, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థలు డీలా పడ్డాయి.  రవాణా రంగం ఘోరంగా దెబ్బతిన్నది. ఇప్పుడిప్పుడే  ఆర్థికంగా పడిలేస్తున్న తెలంగాణ ఆర్టీసీ లాక్‌డౌన్ ప్రభావంతో మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. మొన్నటి వరకు సమ్మె, తాజాగా లాక్‌డౌన్‌ పరిస్థితులు తెలంగాణ ఆర్టీసీ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి.

 

లాక్‌డౌన్ ప్రభావం అత్యధికంగా పడింద రవాణా వ్యవస్థపైనే.  ప్రభుత్వ, ప్రయివేటు ట్రాన్స్‌పోర్ట్ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ కీలకం. హైదరాబాద్ నుంచి జిల్లాలకు...జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాలకు కూడా రవాణా సేవలు అందించే ఆర్టీసి ఇప్పుడు మళ్లీ నష్టాల్లో కూరుకుపోతుంది. అంతా సవ్యంగా ఉండి బస్సులు తిప్పితేనే...నిత్యం రెండు కోట్ల మేర నష్టం వాటిల్లేది. కార్మికుల సమ్మె తరువాత.. ప్రభుత్వం చార్జీలను పెంచింది. పెంచిన చార్జీలతో ఆర్టీసికి అదనంగా 70 లక్షల ఆదాయం పెరిగింది. ఇక ఎండాకాలం ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తెలంగాణ ఆర్టీసీ  పుంజుకున్నట్టే అనుకున్నారు అంతా. ఇంతలో కరోనా వచ్చి పరిస్థితులను తారుమారు చేసింది. ఆదాయానికి గండి పడటంతో ఆర్టీసీ మళ్లీ ఆర్ధికమాంద్యంలోకి నెట్టుకుపోయింది.

 

ఆర్టీసీ బస్సు రొడ్డెక్కినా నష్టమే..బస్టాండ్ లో ఉన్నా నష్టమే అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి. కార్పోరేషన్ అనుకున్నట్టుగా బస్సులు నడిపితే...ఆర్టీసికి నిత్యం వచ్చే ఆదాయం 13.50 కోట్లు. కానీ మార్చి 22 నుంచి బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఏప్రిల్‌ 30 వరకు రోడ్డెక్కే పరిస్థితులు లేవు. మొత్తంగా 39 రోజులు ఆర్టీసీ బస్సులు రెస్ట్‌లో ఉంటాయి.  ఈ లెక్కన 526. 5 కోట్ల  ఆదాయానికి గండిపడినట్టైంది. బస్సులు ఎక్కడివక్కడ తిప్పకుండా ఉంటే ఆదాయానికి పడిన గండి 526 కోట్లు... ఐతే రెగ్యులర్ గా వచ్చే నష్టం సుమారు 45 కోట్ల పై చిలుకు అయ్యేది. కానీ పెంచిన ఆర్టీసీ చార్జీలతో ఆర్టీసి చాలా కోలుకునేది. కానీ కరోనా దెబ్బకు మళ్లీ ఆర్టీసి కుదేలైంది.

ప్రభుత్వ రవాణా రంగం ఇలా ఉంటే ఇక ప్రయివేటు రవాణా వ్యవస్ధ  మరింత నష్టాల్లో కూరుకుపోయింది. తెలంగాణలో రవాణా రంగం...లారీలు, డీసీఎంల మీదే ఎక్కువ ఆదార పడి ఉంటుంది. పరిశ్రమలు, వ్యాపార రంగానికి నిత్యావసరాల సరుకుల రవాణా అంతా వీటి మీదే ఆదారపడి ఉంటుంది. రాష్ట్రంలో లక్ష 75 వేల లారీలు ఉన్నాయి. లాక్ డౌన్ తో  మొదటి రెండు రోజులు లారీలు ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయి. తరువాత వీటిని లాక్ డౌన్ నుంచి మినహాయించినా... కోలుకోలేదు. సగం వాహనాలు అన్ లోడ్ చేయకుండానే మిగిలిపోయాయి. దీనికి తోడు... డ్రైవర్లు, క్లీనర్ లు కూడా కరోనా భయంతో విధుల్లోకి రావటానికి ఇబ్బంది పడుతున్నారు. ఉన్న లారీల్లో రోడ్డెక్కినవి 30 శాతం వాహనాలే. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. నిత్యం ఒక్కో లారీ కనీసం 3 వేల వరకు సంపాదించినా... 52 కోట్ల మేర  ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఈ ఆదాయానికి మొత్తం గండికొట్టింది కరోనా.

 

ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న ఆర్టీసీ లాక్‌డౌన్‌తో నేలచూపులు చూస్తోంది. ప్రైవేటు రవాణ వ్యవస్థ పరిస్థితీ దయనీయంగా ఉంది.  సంక్షోభంలోంచి రవాణా రంగం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: