దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8447కు చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 918 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా భారీన పడి 273 మంది మృతి చెందారు. ఏపీ పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 1000 దాటింది. నెమ్మదిగా వైరస్ దేశంలో విస్తరిస్తోంది. అయితే తాజాగా మహారాష్ట్రలో ఒక చిన్నారి కరోనాను జయించింది. 
 
ముంబైలోని క‌ళ్యాన్ ప్రాంతానికి చెందిన ఆరు నెల‌ల చిన్నారి కొన్ని రోజుల క్రితం కరోనా భారీన పడింది. పాప తల్లిదండ్రులు కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పాపను ఆస్పత్రిలో చేర్పించి కరోనా పరీక్షలు చేయించారు. పాపకు కరోనా నిర్ధారణ కావడంతో పాప తల్లిదండ్రులు చికిత్స చేయించారు. చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో పాటు తాజాగా చేసిన పరీక్షల్లో నెగిటివ్ నిర్ధారణ అవడంతో వైద్యులు పాపను ఇంటికి పంపించారు. 
 
ఆరు నెలల చిన్నారి కరోనాను జయించడంతో స్థానికులు ఆ పాపకు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్రలో కరోనా నుంచి కోలుకున్న అతి పిన్న వయస్కురాలిగా పాప రికార్డు సృష్టించింది. పాపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 134 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నూరుపై పైగా కేసులు రాష్ట్ర రాజధాని ముంబైలోనే నమోదు కావడం గమనార్హం. 
 
ముంబాయిలో కరోనా కేసుల సంఖ్య 1865కు చేరింది. ఇప్పటివరకూ 134 మంది రాష్ట్రంలో కరోనా భారీన పడి మృతి చెందారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 405కు చేరగా తెలంగాణలో 504 కరోనా కేసులు నమోదయ్యాయి.              

మరింత సమాచారం తెలుసుకోండి: