కరోనా మహమ్మారి అమెరికాను కమ్మేస్తోంది. కరోనా భూతం ఆదేశాన్ని వణికిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కరోనా బారిన పడి మరణిస్తున్నారు. మొదట్లో కరోనాను తేలిగ్గా తీసుకున్న అమెరికా ఇప్పుడు దాని ఫలితం చవిచూస్తోంది. ఇప్పుడు కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే.. అమెరికాలో కరోనా వైరస్ ను దేశవ్యాప్త విపత్తుగా అమెరికా అద్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

 

 

కరోనా మహమ్మారి విజృంభణను దేశవ్యాప్త విపత్తుగా అమెరికా అధ్యక్షుడు గుర్తించారు. దేశంలోని 50 రాష్ట్రాల్లో మహా విపత్తు పరిస్థితులు నెలకొన్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా చరిత్రలో ఇలా చేయడం ఇదే మొదటిసారి. తొలి కేసు నమోదైనప్పటి నుంచి తీవ్రతను బట్టి ఒక్కో రాష్ట్రంలో విపత్తును ప్రకటిస్తూ వచ్చిన వైట్ హౌస్ ఆఖరుగా వ్యోమింగ్ కూ వర్తింప చేయడంతో అన్ని రాష్ట్రాలు దీని పరిధిలోనికి వచ్చేసినట్టైంది.

 

 

మొదట్లో అమెరికాలో కరోనా కొన్ని రాష్ట్రాలకే పరిమితమైనా... లాక్‌డౌన్ లేకపోవడం వల్ల క్రమంగా మిగిలిన అన్ని రాష్ట్రాలకూ వ్యాపించింది. దీంతో మహా విపత్తుగా ప్రకటించాల్సి వచ్చింది. మరి ఇలా ప్రకటిస్తే ఏం జరుగుతుందంటే.. ఇందువల్ల ఫెడరల్ ప్రభుత్వ నిధులను రాష్ట్రాలు వినియోగించే అవకాశం ఏర్పడుతుంది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు నేరుగా వైట్ హౌన్ నుంచే నిధులు అందుతాయి.

 

 

అంతే కాదు.. ఇప్పటి వరకూ కరోనా కట్టడి బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాగా.. ఇప్పుడు ఈ ప్రకటనతో ఇతర అత్యవసర సేవల్ని కూడా ఫెడరల్‌ ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. శనివారం కొత్తగా 1912 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 20,597కు చేరింది. ఇప్పటి వరకూ అమెరికాలో 5.33 లక్షల మందికి కరోనా సోకింది. ఇప్పుడు మహా విపత్తుగా ప్రకటించడంతో కట్టడి చర్యలు ఊపందుకునే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: