ఏపీలో మొదట్లో కేసులు చాలా స్వల్పంగా ఉన్నాయి. కానీ అనూహ్యంగా పెరుగుతూ వచ్చి, రెండు జిల్లాలు మినహా రాష్ట్రమంతా కరోనా కేసులు విస్తరించాయి. అయితే 11 జిల్లాల్లో కరోనా ఉన్నా, మండలాలుగా చూస్తే 37 మండలాలు మాత్రమే రెడ్‌ జోన్‌ లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయటం ద్వారా కరోనాకు చెక్ పెట్టవచ్చని ఏపీ సర్కారు భావిస్తోంది. 

 

ఏపీలో  కరోనా కేసులు ర్యాపిడ్ గా పెరగటంతో కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో 676 మండలాలకుగాను 37 మండలాలు రెడ్ జోన్లో ఉన్నాయి. 44 ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి. 595 మండలాల్లో కరోనా ప్రభావం లేదు. 

 

ఏపీలో  కరోనా పాజిటివ్ కేసు నమోదైన ఇంటి చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్‌ జోన్‌ గా పరిగణిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో 133 రెడ్‌ జోన్లు  ఉన్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీటిలో నెల్లూరు 30, కర్నూలులో 22, కృష్ణా జిల్లాలో 16 రెడ్‌ జోన్లు, గుంటూరు 12, ప.గో జిల్లా 12, ప్రకాశంలో 11 రెడ్‌ జోన్లు, తూ.గో జిల్లాలో 8, చిత్తూరులో 7, విశాఖలో 6 రెడ్‌ జోన్లు గుర్తించారు. కడప 6, అనంతపురంలో 3 ప్రాంతాలను రెడ్‌ జోన్లు గా గుర్తించారు.

 

ఏపీలో మార్చి 20వ తేదీ నాటికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే, పదిలోపు కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ, 20 రోజులు గడిచేసరికి సీన్ మారింది. విజయనగరం, శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాలకు వైరస్ పాకింది. అందులోనూ కర్నూలు,  గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 13 జిల్లాలున్న రాష్ట్రంలో 8 జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 80కిపైగా కరోనా కేసులు నమోదయితే, గుంటూరులో 70కిపైగా, నెల్లూరు దాదాపు 50 కేసులు నమోదయ్యాయి.  

 

ఏపీలో రెడ్ జోన్లుగా ప్రకటించిన 133 ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా తిరిగితే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఎక్కడికక్కడ లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

 

ముఖ్యంగా లాక్ డౌన్ లో ఉన్న ప్రాంతాలకు రెడ్ జోన్ లో ఉన్న ప్రాంతాలకు చాలా తేడా ఉంటుంది. రెడ్ జోన్ ప్రాంతంలో అత్యంత కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. రెడ్ జోన్ నుంచి 3కి.మీ ల చుట్టు ఉన్న ప్రాంతాలను కంటెయిన్ క్లస్టర్లుగా పిలుస్తున్నారు. పట్టణాలు నగరాల్లో వైరస్ వ్యాప్తికి  అవకాశం ఉన్న 5 కి.మీల ప్రాంతాన్ని బఫర్ జోన్ గా ప్రకటించారు.

 

రెడ్ జోన్ ప్రాంతంలో ఉండే వారు బయటకు వచ్చేందుకు అనుమతి లేదు. బయటకు కాదు కదా కనీసం పక్కింటికి వెళ్లడానికి కూడా వీల్లేదు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలను అధికారులే ఇళ్ల వద్దకు చేరుస్తారు. వాటిని కూడా ఇంట్లో నుంచి ఒకరు మాత్రమే బయటకు వచ్చి తీసుకోవాల్సి వుంటుంది. లాక్ డౌన్ సమయంలో ఇతర ప్రాంతాల్లో వారు నిర్ణీత సమయాల్లో నిత్యావసరాలకోసం బయటకువెళ్లే వీలున్నా, రెడ్ జోన్ పరిధిలోని వారు మాత్రం కనీసం ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా వీలుండదు. అంతేకాదు.., బయటి వారికి ఈ ప్రాంతంలోకి వచ్చేందుకు కూడా  అనుమతి ఉండదు. రెడ్ జోన్ ప్రాంతానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధి వరకూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలి. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రత్యేక వాహనాల సాయంతో పిచికారీ చేయాల్సా ఉంటుంది.

 

రెడ్ జోన్ లలోని ప్రజలు ఎంతో అత్యవసరమైతేనే, అది కూడా పోలీసుల అనుమతితోనే బయటకు రావాల్సి వుంటుంది. ఈ  ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసి, అన్ని దారులను బారికేడ్లతో మూసేశారు. అలాగే వాటి దగ్గర రెడ్‌ జోన్ అని సూచించే సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. రెడ్ జోన్ లున్న ప్రాంతాల్లో నిరతంతరం  పోలీసు గస్తీ ఏర్పాటు చేశారు. గుర్తింపు పొందిన అధికారులు, హెల్త్ వర్కర్లు, నిత్యావసరాలు సరఫరా చేసే వారికి మాత్రమే బారికేడ్లను దాటి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఇక కరోనా పాజిటివ్ కేసు నమోదైన ఇంటికి, ఆ ఇంట్లో మహమ్మారి ఉందని సూచించేలా ప్రత్యేక స్టిక్కర్లను కూడా అంటిస్తున్నారు.

 

ఈ ప్రాంతంలోని వారిలో ఎవరికైనా జలుబు, దగ్గు తదితర కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో, రోజుకు రెండు సార్లు హెల్త్ వర్కర్లు పరీక్షిస్తున్నారు. ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారి నమూనాలను సేక రించి, క్వారంటైన్ చేస్తున్నారు. రెడ్ జోన్ల పరిధిలో కనీసం 14 రోజుల పాటు ఈ కఠిన ఆంక్షలుంటాయి. ఈలోగా కొత్త కేసులు రాకుండా ఉంటేనే నిబంధనలు తొలగిస్తారు. లేని పక్షంలో ఈ ఆంక్షలు మరో 14 రోజులు కొనసాగుతాయి. తద్వారా కరోనా పాజిటివ్ కేసులు తగ్గించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: