ప్రపంచాన్ని ఓ రేంజ్ లో వణికిస్తున్న కరోనా మహమ్మారి భారతదేశంలో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య దాదాపు 9 వేల వరకు చేరుకోగా, అందులో 7632 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. అయితే రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రం చూస్తోంది. ఇదే సమయంలో జోన్ల వారీగా లాక్ డౌన్ అమలు చేసే యోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది.

 

ఇక ఈ కరోనా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప, తగ్గడం లేదు. రోజురోజుకూ రెండు రాష్ట్రాల్లో కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం కలవరం రేపుతోంది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ నెలాఖరు వరకు లాక్ డౌన్ విధించేసారు. అటు సీఎం జగన్ కూడా కేంద్రం బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. కాకపోతే ఆర్ధిక పరిస్థితులు దృష్ట్యా లాక్ డౌన్ రెడ్ జోన్ ప్రాంతాలకే పరిమితం చేయాలని జగన్, ప్రధానిని కోరిన విషయం తెలిసిందే.

 

ఇదిలా ఉంటే భారతదేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 7 , 9 స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణాలో మొత్తం 503 మంది కరోనా బారిన పడగా, అందులో 14 మంది చనిపోయారు. ఇక 96 మంది కోలుకున్నారు. ప్రస్తుతానికి 393 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి.

 

అటు ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 420 కాగా,  డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య 12 , ఇక మరణించిన వారు 7. ఇక దేశం మొత్తం మీద చూసుకుంటే కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ లో ఉంది. ఆ రాష్ట్రంలో దాదాపు 1900 వరకు కరోనా బారిన పడ్డారు. తర్వాత తమిళనాడు 1075 , ఢిల్లీ 1069 ,రాజస్థాన్ 796 , మధ్యప్రదేశ్ 562 , గుజరాత్ లో 516 కేసులున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: