కాదేది కవిత్వానికి అనర్హం అన్నట్లు...ఏపీలో రాజకీయం చేయడానికి ఏది అనర్హం కాదు. ఏపీలో ప్రతి పార్టీకి రాజకీయం చేయడానికి పెద్ద పెద్ద టాపిక్స్ ఏం ఉండక్కర్లేదు. ఏదైనా చిన్న పాయింట్ ఉంటే చాలు దాని మీద రాజకీయం చేయగలరు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏపీలో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో అన్ని పార్టీలు కలిసి ముందుకెళ్లాల్సింది పోయి, రాజకీయం చేయడంలో ముందుకెళుతున్నారు.

 

ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు కరోనాపై రాజకీయం చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే క్వారంటైన్ గొడవ ఒకటి నడుస్తోంది. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, హైదరాబాద్ లో ఉంటూ మీడియా ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి, పార్టీకి సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే సొంత రాష్ట్రంలో ఉండకుండా హైదరాబాద్ లో ఉండి సలహాలు ఇవ్వడం ఏంటని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అలాగే ఒకవేళ బాబు ఏపీకి వస్తే 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని మాట్లాడుతున్నారు.

 

ఇక దీనికి టీడీపీ వాళ్ళు కూడా తగ్గకుండా కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చారు. అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో పలు జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఇక తాజాగా కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషనర్ కనగరాజ్ తమిళనాడు నుంచి విజయవాడ వచ్చారు. దీంతో వారిని కూడా క్వారంటైన్ లో పెట్టాలని టీడీపీ వాళ్ళు చెబుతున్నారు.

 

ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్ ని క్వారంటైన్ లో ఉంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇక వీరికి తోడుగా తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కూడా ఈసీని క్వారంటైన్ లో పెట్టాలని అంటున్నారు. అయితే ఈ క్వారంటైన్ గొడవ లేపింది వైసీపీ నేతలు. చంద్రబాబు రాకుండానే క్వారంటైన్ లో పెట్టాలని మాట్లాడారు. కానీ వైసీపీ నేతలే అటు ఇటు తిరుగుతున్నారు కాబట్టి, ముందు వాళ్లే క్వారంటైన్ లో ఉంటే బెటర్ అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: