గౌరవ ముఖ్యమంత్రివర్యులు  కేసీఆర్ గారికి,  ఒక విజ్ఞప్తి..

 

కరోనా కట్టడి నేపథ్యంలో ఎవరింటికి వాళ్ళం పరిమితమైనం. బలవంతంగా నైనా దిగ్భంధనానికి గురైనం. ఈ సమయంలో తాత్కాలికంగానైనా  కొన్ని అలవాట్లు మార్చుకోక తప్పని పరిస్థితిలో పడ్డాం. ఈ తరుణంలో కొన్ని విషయాలు ఆలోచించడం అవసరం . తెలంగాణా సమాజం భవిష్యత్ కోసం శాశ్వత మద్యపానం నిషేధం కోసం ప్రతిన  పూనడం గురించే ఈ లేఖ.

 

లాక్‌డౌన్‌ సమయంలో ఇప్పటిదాకా మద్యం అమ్మకాలను నిషేధించిన , ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాక్ డౌన్ అనతరం రాష్ట్రంలో శాశ్వత మద్యపాన నిషేధం దిశగా ఆలోచించడం మంచిది. వారికి ఈ విషయంలో గట్టిగా అందరం విజ్ఞప్తి చేయడానికి ఇది తగిన సమయం . రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగా లేక పోయినా , మీరు జీవన్మరణ సమస్య వంటి కరోనా నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకున్నారు. ఉద్యోగుల జీతాలు దాదాపు యాభై శాతం తగ్గించడం మీ ముందు చూపుకు, సాహసోపేత వ్యక్తిత్వానికి ఉదాహరణ. అదే విధంగా రైతుల కోసం ముప్పయ్ వేల కోట్లను సిద్దం చేసి పంట కొనుగులుకోసం తగిన చర్యలతో సాటి లేని నిర్ణయాన్ని తీసుకున్నారు. 

 

 

ఇవన్నీ హెల్త్ ఎమర్జెన్సీనేపథ్యంలో తప్పని, అనివార్య సమయంలో తెసుకున్న నిర్ణయాలే కావోచ్చు. కానీ, మొత్తం పౌర సమాజం కదలక మెదలక ఒక్క చోట, అదీ ఇంట్లో బందీ అయిన నేటి సందర్భం నిజానికి ప్రకృతి మనకు ఇచ్చిన వరం. ఇలాంటి తరుణంలో, ఒక ఆత్యయిక స్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు దృడంగా తీసుకుంటున్న నిర్ణయాలలో భాగంగా మరో ఆలోచన చేయాలని చెప్పాలనిపిస్తోంది. మొత్తం సామాన్య, మధ్యతరగతి ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే మద్యపాన నిషేధంపై ఇప్పుడే మీరు గట్టిగా పునరాలోచన చేయాలి.

 

 

ఆర్ధిక వనరుగా మద్యపానం ప్రభుత్వాలకు ఎంత పెద్ద వరమో అందరికీ తెలుసు. కానీ, అది దీర్ఘకాలికంగా సమాజ ఆరోగ్యాన్ని ఎలా పాడుచేస్తుందో ముఖ్యమంత్రిగా మీకు తెలియంది కాదు. కాకపోతే, సమాజం ఇప్పుడు కటిన నిర్ణయాలను అంగీకరించేందుకు సిద్దంగా ఉన్నది. ముఖ్యంగా కేసీఆర్ గారు దృడమైన నిర్ణయం తీసు కుంటే ఎవరైనా ఒప్పుకునే పరిస్థితే ఉంటుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు ఆలోచించడం కరోనా నేపథ్యంలో మీకు అందివచ్చిన అవకాశం.  సామాజిక బాధ్యత. ఇది తగిన సమయం కూడా.  

 

 

ఇప్పుడు మీరు తీసుకునే ఈ నిర్ణయాలు కొన్ని తరాల వరకు ఆరోగ్యవంతమైన సమాజానికి ఆదర్శంగా  నిలుస్తుంది అందుకు సమర్థులు మీరే కేసీఆర్ గారు. కరోనా అనంతరం మొత్తం సమాజం మద్యానికి దూరంగా ఉంచేలా గట్టి కార్యక్రమం తీసుకోవడం ప్రభుత్వ విధ్యుక్త ధర్మం. ఇటు పౌర సమాజపు కనీస బాధ్యత. ఇది మా సూచన.

 

 

అదృష్టవశాత్తూ ఒక హక్కుగానే కాక బాధ్యతగా మెసిలే అవకాశం కరోనా మనకు కలిగించింది. అది ఎన్నో విధాలా మనలో విప్లవాత్మకమైన చర్యలకు ప్రేరేపిస్తోంది. అందులో మద్యపాన నిషేధం ఒకటిగా జోడించడం మన చేతనకు, సమాజ ప్రగతి కి ఎంతో మంచిది.  పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు ఇదివరకే ఈ దిశలో కార్యాచరణ ప్రారంభించారు. కాబట్టి ఈ విషయంలో వారు మరింత సానుకూలంగా ఉంటారనే మనం ఆశించవచ్చు. వారికి కూడా ఇదే ప్రత్యేక విజ్ఞప్తి.

 

 

మద్యపాన నిషేధం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  తప్పక ప్రకటిస్తారని, అందుకోసం యుద్ధ ప్రాతిపదికగా ఒక థింక్ ట్యాంక్ ఏర్పాటు చేసి, కొన్ని నెలల్లో సంపూర్ణ మద్య నిషేధానికి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి. ఇప్పుడు ఏర్పాటైన క్య్యారంటైన్ కేంద్రాలు, ఆసుపత్రులు, అన్ని విధాలా సిద్దంగా ఉన్న  వైద్య సిబ్బంది, కరోనా లాక్ డౌన్ అనతరం మద్యపాన  నిషేధం వలన గలిగే అన్ని సమస్యలనూ ఎదుర్కోవడానికి ఉపకరిస్తాయి కూడా. మద్యం నుంచి వచ్చే వనరుల లేనప్పుడు ప్రభుతాల మనుగడ కోసం చేయవలసిన కసరత్తు ఈ నెల రెన్నేళ్ళు చేయడానికి ప్రయత్నిస్తే నిజంగా సమాజం బతికిపోతుంది. కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్థాయి. 

 

- శ్యాంమోహన్, ఎడిటర్, రూరల్ మీడియా

మరింత సమాచారం తెలుసుకోండి: