ప్రస్తుతం లోకంలో శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్నాయి.. మన ఇండియాలో ఇంకా పరిస్దితులు విషమించలేదు కాబట్టి ప్రాణం విలువ అందరికి తెలిసిరాలేదు గాని.. ప్రపంచదేశాల్లో కొన్ని దేశాల పరిస్దితులు మరీ దారుణంగా ఉన్నాయి.. అక్కడి ప్రజలకు కళ్ల ముందే మృత్యువు కనిపిస్తున్న ఏం చేయలేని పరిస్దితులు నెలకొన్నాయి.. ఇలా ఎందరో ప్రాణాలు కరోనాకు బలి అవుతున్నాయి.. ఇకపోతే మొన్నటి వరకు చైనా, ఆ తర్వాత ఇటలీ, నేడు అమెరికా ఈ కరోనా దాడిలో చిత్తు చిత్తు అవుతున్నాయి..

 

 

ఇలాంటి కరోనా ప్రస్తుతం ఈక్వెడార్‌ను మరింత దారుణ పరిస్థితుల్లోకి నెట్టేసింది. అక్కడి పరిస్థితులు చూసిన వారి హృదయాలు తరుక్కు పోతున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, భౌతిక దూరాన్ని గాలికి వదిలేయడం, సామాజిక, ఆర్థిక అసమానతలు ప్రస్తుతం ఆ దేశాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేశాయి. ఫలితంగా మృత దేహాలు రోడ్లపైనా, ఫుట్‌పాత్‌ల పైనా దర్శనమిస్తున్నాయి. శవపేటికలు కూడా దొరకని దుర్భర పరిస్థితులు ఇప్పుడు అక్కడ నెలకొన్నాయి. అయితే ఇక్కడి ప్రజలు ఎక్కువగా స్పెయిన్, ఇటలీలకు వలస వెళ్తుంటారు. ఈ చర్యనే వారి కొంప ముంచింది. అదెలా అంటే.. ఇటలీ, స్పెయిన్, దేశాలు కరోనాకు కన్నబిడ్దల్లా మారడంతో అక్కడ నివసిస్తున్న ఈక్వెడార్ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

 

 

అదీగాక ఈక్వెడార్‌లో వైరస్ తన వేటను కొనసాగిస్తుంటే.. అదేమి పట్టనట్లుగా సంపన్నుల ఇంట్లో పెళ్లిళ్లు జరగడం, దానికి వందలాదిమంది హాజరు కావడంతో వైరస్ ఒక్కసారిగా విరుచుకు పడింది.. అంతటితో ఆగకుండా మురికివాడలకు కూడా పాకింది... ఈ సమయంలో పూట గడవని పేదలు జానెడు పొట్టకోసం పనులకు వెళ్లి వైరస్ బారినపడి తనువు చాలిస్తుండగా, మరికొందరు ఆహారం కోసం భిక్షాటన చేస్తూ వైరస్‌ను అంటించుకుంటున్నారు.. ఇలా వైరస్ అధికంగా వ్యాపించుతున్న సమయంలో కఠిన ఆంక్షలు విధించిన ఈక్వెడార్ ప్రభుత్వం ప్రజలు ఇళ్లలోనే వుండాలని, నెలకు 60 డాలర్ల చొప్పున ఇస్తామని ప్రకటించింది.. కానీ పేదల వరకు ఈ పధకాలు చేరుతాయనే నమ్మకం అక్కడి ప్రజలకు లేదట.. ఏది ఏమైనా ఈక్వెడార్‌ ప్రస్తుతం శవాల గుట్టలుగా మారుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: