చైనాలో పుట్టి ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల్లోలానికి కార‌ణంగా మారుతున్న క‌రోనా వైర‌స్ విష‌యంలో ఇంకా ప్ర‌పంచ‌దేశాలు వ‌ణికిపోతున్నాయి. లక్షల సంఖ్యలో బాధితులు, వేల సంఖ్యలో మరణాలు ఇప్పుడు ప్ర‌పంచం అంతా స‌ర్వ‌సాధార‌ణం అవ‌డం  బాధాక‌ర‌మైన నిజం. ఈ ప‌రిణామాల‌పై హైద‌రాబాద్‌లోని నిమ్స్‌ పల్మనాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ పరంజ్యోతి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా పాజిటివ్ వారి విష‌యంలోనే కాకుండా... వ్యాధి నుంచి కోలుకున్న వారి విష‌యంలోనూ జాగ్ర‌త్తలు అవ‌స‌రం అని ఆయ‌న అన్నారు. కరోనా పాజిటివ్‌ నుంచి పూర్తిగా కోలుకొన్న వ్యాధిగ్రస్థులు దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కూడా కనీసం నెలపాటు స్వీయ గృహనిర్బంధంలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు.

 


నిమ్స్‌ పల్మనాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ పరంజ్యోతి చైనాలోని ప‌రిణామాల‌ను విశ్లేషిస్తూ....చైనాలోని వుహాన్‌ ప్రజలు త్వరగా కోలుకొనేందుకు అక్కడి ప్రభుత్వం క్వారంటైన్‌ పద్ధతిని కచ్చితంగా పాటించిందని త‌ద్వారా వ్యాధి విస్త‌ర‌ణ ఆగింద‌న్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ వ్యాధిగ్రస్థుడు పూర్తిగా కోలుకొని తదనంతర వైద్యపరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన తర్వాత కూడా నెలపాటు ఆస్ప‌త్రి  క్వారంటైన్‌లోనే ఉంచారని దీంతో వ్యాధి విస్త‌ర‌ణ త‌గ్గింద‌ని తెలిపారు. దీనికి కార‌ణం, పాజిటివ్‌ నుంచి నెగెటివ్‌కు కోలుకొన్నప్పటికీ రోగి శరీరంలో వైరస్‌ కారకాలు ఉండే అవకాశాలు ఉండ‌ట‌మ‌ని పరంజ్యోతి పేర్కొన్నారు. పాజిటివ్‌ రోగులను అక్కడ కనీసం 60 నుంచి 70 రోజుల వరకు క్వారంటైన్‌లో ఉంచి కేసుల సంఖ్య పునరావృతం కాకుండా జాగ్రత్త పడ‌టం అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న తెలిపారు.

 

 

నెగిటివ్ వ‌చ్చి నుంచి డిశ్చార్జి కాగానే జనాల్లోకి వెళ్ళడం, ఇంటివారితో, స్నేహితులతో కలివిడిగా ఉండటం చేయకూడదని నిమ్స్  వైద్యుడు స్ప‌ష్టం చేశారు. సాధారణంగా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిన వ్యక్తికి చేసే గొంతు, ముక్కు ప‌రీక్ష‌ల్లో నెగిటివ్‌ వచ్చినప్పటికీ రోగి మలంలో మాత్రం పాజిటివ్‌ వస్తుందని, అంటే రోగి శరీరంలో వైరస్‌ కారకాలు కోలుకొన్నప్పటికీ కనిపిస్తున్నట్టుగా భావించాలని పేర్కొన్నారు. ఇలాంటివారికి చికిత్స పెద్దగా అవసరం ఉండదని, అయితే ముందుజాగ్రత్త చర్యగా దవాఖాన నుంచి డిశ్చార్జి అయి ఇంటికిపోయిన తర్వాత కనీసం మరో 30 రోజులు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని చెప్పారు. ఇలా మరో నెలపాటు స్వీయ గృహ నిర్బంధం పొడిగించడం రోగితోపాటు కుటుంబసభ్యులకు, ఆయనతో కలిసే ఇతరులకు కూడా మంచిదని గుర్తుంచుకోవాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: