కరోనా వైరస్ మహమ్మారి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారో, అంతే స్థాయిలో ఆందోళన లోనూ ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ విషయంలో కేసీఆర్ చాలా ధైర్యం గానే ఉంటూ వస్తున్నారు. త్వరలోనే తెలంగాణ నుంచి వైరస్ మహమ్మారిని తరిమి కొడదామని చెబుతూనే, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కేసీఆర్ మరికొంత కాలం పొడిగించాలంటూ కోరారు. అంతేకాకుండా ప్రధాని నిర్ణయం వెలువడక ముందే తెలంగాణలో లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు గా ప్రకటించారు. త్వరలోనే తెలంగాణలో కరోనా వైరస్ కనిపించదు అంటూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి గొప్పగా చెబుతున్న సమయంలోనే తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభించడం కేసీఆర్ కు ఆందోళన కలిగిస్తోంది. 

 

ఇప్పటికే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 530 వరకు నమోదయ్యాయి. మరో రెండు, మూడు రోజుల్లో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అలాగే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ని ఆనుకుని మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో, తెలంగాణ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అందుకే ఆ సరిహద్దు ప్రాంతాల నుంచి తెలంగాణకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా నివేదికలో అందాయట.


అందుకే మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్ లో ఉన్న అన్ని మార్గాలను మూసి వేయాల్సిందిగా కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మహారాష్ట్ర నుంచి అత్యవసరంగా దిగుమతి చేసుకుని సరుకులను కూడా తెలంగాణకు రాకుండా చేయాలని కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా చెప్పగా, అక్కడి నుంచి కూడా సానుకూల నిర్ణయం వెలువడినట్లు సమాచారం. ఇక ఎట్టి పరిస్థితిల్లోనూ సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎవరు రాకపోకలు సాగించకుండా చూడాల్సిందిగా కెసిఆర్ సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఆ ప్రాంతాల్లో కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించాలని చూస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: