క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్ ముగిసేందుకు మ‌రో రోజు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. లాక్‌డౌన్‌ పటిష్ఠ అమలుతో ఆయా రాష్ట్రాల‌లో కేసులు తగ్గుతున్నాయి. మ‌రోవైపు ఏప్రిల్ 15 త‌ర్వాత లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? అనే చ‌ర్చ సైతం తెర‌మీద‌కు వ‌స్తోంది. అయితే, లాక్‌డౌన్ పొడ‌గించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్రం త‌గు క‌స‌ర‌త్తు చేస్తోంది. ప్రజారోగ్యం, జీవనోపాధి రెండింటినీ సమన్వయం చేస్తూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ఏయే అంశాల్లో వెసులుబాటు క‌ల్పించాలి, ఏయే విష‌యాల్లో కఠినంగా వ్య‌వ‌హ‌రించాలి అనే దానిపై కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో లాక్‌డౌన్ పొడ‌గింపు ఖాయ‌మ‌ని తేలుతోంది.

 

లాక్‌డౌన్ విష‌యంలో కేంద్రం ప‌లు ఆప్ష‌న్స్‌ను అన్వేషిస్తున్న‌ట్లు స‌మాచారం. వ్యవసాయ రంగానికి ఆంక్షలతో కూడిన సడలింపును ఇచ్చి పంట కోత, పంట ఉత్పత్తుల అమ్మకాలకు అడ్డు లేకుండా చర్యలు చేపడుతున్న‌ట్లుగానే మ‌రిన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు సైతం వెసులుబాటు క‌ల్పించాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రజారోగ్యం కాపాడుతూ, పరిశ్రమలను తెరిచేలా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ప్రత్యేక అనుమతులతో ప్రత్యేక బస్సులు, రైళ్లలో వ‌ల‌స కూలీల‌ను స్వ‌స్థ‌లాల‌కు పంపే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం.

 

ఇదిలాఉండ‌గా, లాక్‌డౌన్ విష‌యంలో కఠిన చర్యలు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ప్రభుత్వం చెప్పేది తమకు కాదన్నట్టుగా వ్యవహరిస్తూ ముప్పు మరింత పెరిగేలా చేస్తున్న కొంద‌రి తీరుపై ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఉంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ చట్టం- 2005ను అమలులోకి తీసుకుంది. ఈ చట్టంలో ప్రధానంగా సెక్షన్‌ 51 నుంచి సెక్షన్‌ 60 వరకు వివిధ నేరాలు, వాటి శిక్షలను నిర్వచించారు. సెక్షన్ 51 ప్ర‌కారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలను సరైన కారణం లేకుండా అతిక్రమించేవారికి ఏడాది జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: