అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మ‌రోమారు ప్రెసిడెంట్ సీటు ద‌క్క‌డం డౌట్ అని క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి అమెరికా విలవిలలాడుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఒక్క న్యూయార్క్ నగరంలోనే కోవిడ్-19 బాధితుల సంఖ్య లక్ష దాటింది. ఈ వ్యాధికి పుట్టినిల్లయిన చైనా కంటే, బ్రిటన్‌కంటే కూడా అ ఒక్క నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటం అక్కడి దయనీయ పరిస్థితి అద్దం పడుతుండ‌గా ఆయ‌నపై అమెరిక‌న్లు ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

 

అమెరికాకు చెందిన‌ న్యూయార్క్‌ టైమ్స్ దేశంలోని పరిస్థితుల‌ను వివ‌రిస్తూ అమెరికాలో కరోనా విజృంభనకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ఒంటెత్తు పోకడలే కారణమని పేర్కొంది. వైరస్‌ గురించి ఇంటెలిజెన్స్‌, జాతీయ దర్యాప్తు సంస్థ, ఆరోగ్య శాఖ అధికారులు పలుమార్లు హెచ్చరించినా ట్రంప్‌ పెడచెవినపెట్టారని వెల్లడించింది. వైరస్‌ తీవ్రత గురించి ప్రజలకు తెలియజేయడంలో, దీని వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో ట్రంప్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ మేరకు దర్యాప్తు నివేదికను న్యూయా ర్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. ‘కరోనా చాలా ప్రమాదకరమైనది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే (జనవరి ప్రారంభంలో) మనం అప్రమత్తం కావాలి. ప్రజలనూ అప్రమత్తం చేయాలి’ అని నిఘా వర్గాలు, ఉన్నతాధికారులు హెచ్చరించినా ట్రంప్‌ పట్టించుకోలేదని వెల్లడించింది. ఆదివారం నాటికి న్యూయార్క్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,410కి చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం ఒక్కరోజే ఈ నగరంలో 5,695 మంది కొత్తగా కోవిడ్-19 వైరస్ సోకింది.  

 

కాగా, కరోనా కల్లోలంలో అమెరికా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నది. అన్నిరకాల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్చిలు కూడా ఆన్‌లైన్ విధానానికి మారిపోయాయి. రోజుకు రెండువేల మందికి పైగా మరణిస్తుండడంతో సామూహిక శవ ఖననాలు జరుగుతున్నాయి. మరి సాధారణ పరిస్థితులు నెలకొనేదెప్పుడు? ఈ ప్రశ్నకు అమెరికా అంటువ్యాధుల విభాగం అధిపతి ఆంథోనీ ఫాసీ ఇచ్చే సమాధానం మే నెల. ప్రస్తుతం పరాకాష్టకు చేరుకున్న కరోనా మహమ్మారి అప్పటికి శాంతించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: