అలుపెరుగని శ్రమ వాళ్లది. నిత్యం పరిసరాలను శుభ్రపరిచేందుకు రేయింబవళ్లు  విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వారి పని మాత్రం ఆగదు. అంతికభావంతో  పనిచేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో యావత్  దేశం వారి సేవలకు సలాం కొడుతోంది...వారు ఇంకెవరో కాదు మన పరిసరాలను క్లీన్ గా ఉంచే పారిశుధ్య కార్మికులు.

 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహామ్మారి బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ పరిస్థితి మనదేశంలో రాకూడదని కరోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ పరిస్ధితుల్లో 24 గంటలు అలుపెరుగకుండా నిరంతరం సేవలను అందిస్తున్నారు జీవీఎంసీ సిబ్బంది.

 

 ఓ వైపు కరోనా ప్రభావంతో లాక్ డౌన్‌ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన  ప్రాంతాల్లో రెడ్ జోన్ లుగా ప్రకటించి ఎవరూ ఇళ్లనుంచి భయటకు రావద్దని ఆంక్షలు విధించారు. యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా...ఎవరి నుంచి ఎవరికి వస్తుందో  ..ఎలా వస్తుందో తెలీదు. కానీ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులను నిర్వర్తిస్తున్నారు జీవీఎంసీ పారిశుథ్య కార్మికులు.

 

లాక్ డౌన్ విధించడంతో అన్ని విభాగాలకు సెలవులు దొరికినా వీరికి మాత్రం నగరాన్ని శుభ్రంగా ఉంచే పని తప్పదు. రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తుంటారు పారిశుధ్య కార్మికులు. వీరే లేకుంటే ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతుంది. పరిసరాలన్నీ కంపు కొడతాయి. పేరుకు పోయిన చెత్తతో లేనిపోని కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తాయి.


 ఎవరి బాగోగులు వారు చూసుకునే రోజులివి..కానీ మనతో ఎలాంటి సంబంధం లేకున్నా మన పరిసరాలను శుభ్రపరిచి మన కుటంబాల బాగోగులు పరోక్షంగా పరిరక్షిస్తున్నారు పారిశుధ్య కార్మికులు.  రేపు ఏదో కష్టం వచ్చి మంచాన పడ్డా అడిగే నాధుడు ఎవరూ ఉండడు..ఏది ఏమైనా కరోనా కష్టకాలంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలు మాత్రం వర్ణించలేనివి.

 

విశాఖలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండంతో నగరవాసుల్లో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అయితే ఇంటి నుండి బయటకు రావడానికే ఆలోచిస్తున్నారు. ఇతరుల ఇంటికి వెళ్లడం గానీ, వేరే వాళ్లను తమ ఇళ్లకు రానివ్వడం గానీ ఎట్టి పరిస్థితుల్లో చేయనివ్వడం లేదు.  కానీ నగరంలో పనిచేస్తున్న వేలాది మంది పారిశుధ్య కార్మికులు మాత్రం ఉదయం 5 గంటల నుండే తమ విధులను నిర్వర్తించడానికి సిద్ధమైపోతారు. వాళ్లకి కుటుంబాలు ఉంటాయి. వాళ్లకి ప్రాణాల మీద ఆశ ఉంటుంది. కానీ ధైర్యంగా వారు విధులు నిర్వర్తిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: