అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని  అన్నట్టుగా తయారైంది చిత్తూరు జిల్లా పూల రైతుల పరిస్ధితి. చేతి కొచ్చి కాసులు కురిపిస్తుందని సంతోషిస్తున్న వేళ కరోనా వచ్చి కన్నీటిని మిగిలిచ్చింది. బంతిపూల రైతు బతుకు మరింత చితికిపోయింది.. లాక్‌డౌన్‌ వారి ఆదాయానికి తీవ్రంగా గండికొట్టి అప్పులపాలుజేసింది. ధరలు ఒక్కసారిగా పడిపోవడం, స్థానికంగా కొనేవారే లేకపోవడంతో చిత్తూరు జిల్లాలోని పూల రైతులు గగ్గోలు పెడుతున్నారు.

 

చిత్తూరు జిల్లాలో దాదాపు 6 వేల 400 హెకార్లలో పూల తోటలు సాగవుతున్నాయి. కూరగాయాలు పండించే రైతులు పంట మార్పిడి కింద పూల సాగు చేస్తున్నారు. సాగు అధికంగా ఉన్నా.. తిరుపతి, మదనపల్లెలో తప్ప ఎక్కడా హోల్‌సెల్‌ మార్కెట్‌లు లేవు. పూలు అధికంగా పండే మండలాల్లో ప్రైవేటు పూల మండీలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేటు యాజమాన్యం పరిధిలో ఉంటాయి. ఇక్కడి నుంచి బెంగళూరు, తమిళనాడుకు తీసుకెళ్తారు. కాని కరోనా ప్రభావంతో ఇప్పుడు ఇవన్ని మూతపడిన పరిస్థితి. ఫూర్తిగా రవాణా నిలిచిపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు పూల రైతులు.

 

రెండేళ్లుగా జిల్లాలో  పూల సాగు విపరీతంగా పెరిగిపోయింది.  బంతి , చామంతి 1, మల్లె , రోజా, లిల్లీ  , కనకాంబరం  , కాగడా , ఇతర పూలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి.  కుప్పంలో  ఆఫ్రికన్‌ మేరీగోల్డ్‌ రకం హైబ్రిడ్‌ బంతిపూల సాగు అధికం. ఎకరా సాగుకు 50 వేల వరకు ఖర్చవుతుంది.  5 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. డిమాండు అధికంగా ఉన్నప్పుడు కిలో పూలు  80 రూపాయలు,  అథమంగా  30 రూపాయల వరకూ పలికేది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ పరిస్థితులతో రవాణా సౌకర్యాలు లేక, మార్కెట్‌ పూర్తిగా స్తంభించి   ఇతర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా కిలో పూల ధర  5 రూపాయలకు పడిపోయింది.

 

ఈ సారి జిల్లాలో పూల పంట బాగా పండింది...అంతా బాగానే ఉందని సంతోషించే లోపే కరోనా వచ్చి వారికి కన్నీటిని మిగిలిచ్చింది. రైతులు ఆదాయం పొందాలంటే దిగుబడికి మార్కెటింగ్‌ వసతి ఉండాలి. అప్పుడే గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది.  ఉన్న పంటను కోద్దామంటే కూలీలు కూడా రావడంలేదు. దీంతో చేతికొచ్చిన పంటను ఏం చేయాలో అర్ధం కాక లబోదిబోమంటున్నారు రైతులు. లాక్ డౌన్ కారణంగా పెళ్ళిళ్ళు సహా వివిధ శుభాకార్యలు వాయిదా వేసుకున్నారు ప్రజలు . దీంతో  పూలు కొనేవారు లేక వీధుల్లో పారబోస్తున్నారు రైతులు. అధికశాతం మంది రైతులు పూలను కోయకుండా పశువులకు ఆహారంగా వదిలేస్తున్నారు.

 

అప్పులు తెచ్చి సాగు చేశామని అయితే కరోనా కారణంగా ఇలా అన్ని రకాలుగా పూర్తిగా నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.  నిండా మునిగిపోయామని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: