చైనా ప్రజల ఆహారపు అలవాట్ల వల్లే కరోనా వైరస్‌ వచ్చిందనే వాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రపంచం గడగడలాడుతున్నా.. ఆ దేశంలో చాలా మంది ఈ అలవాట్లుకు ఫుల్‌స్టాప్‌ పెట్టలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహమ్మారి ప్రభావం ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకున్న తర్వాత కూడా ప్రజల్లో చైతన్యం రాకపోతే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చైనాలో రెండోదఫా కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో సర్వత్రా వీటిపైనే చర్చ జరుగుతోంది. 

 

చైనా చరిత్రలో 2019 డిసెంబర్‌ ఒక పీడకలగానే చెప్పాలి. కరోనా వైరస్‌ వెలుగు చూడటం మొదలు.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని వెలుగులోకి వచ్చింది ఈ నెలలోనే. సమస్య తీవ్రతను గ్రహించే లోపుగానే వందల మంది వైరస్‌ బారిన పడ్డారు. గతంలో వచ్చిన కరోనాకు... ఇప్పుడు దాడి చేసిన వైరస్‌కు చాలా తేడా ఉందని గ్రహించిన అక్కడి వైద్యులు.. పాలకులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. 2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు చైనాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అసలు చైనాలో ఏం జరుగుతుందో అని ఆరా తీస్తున్న సమయంలోనే వైరస్‌ చాపకింద నీరులా ప్రపంచాన్ని చుట్టేసింది. చైనాలో తగ్గుతూ వస్తుంటే ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌, అమెరికా, జర్మనీ ఇలా ఒక్కోదేశం కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకు పోయాయి.

 

కరోనా వైరస్‌ వ్యాప్తికి హునన్‌ సీ ఫుడ్‌ మార్కెట్‌ను కేంద్రంగా గుర్తించి.. దానిని జనవరి ఒకటినే మూసివేశారు. ఈ మార్కెట్‌ గురించి బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత చైనా ప్రజల ఆహారపు అలవాట్లే ఈ వైరస్‌కు బీజం వేశాయని భావించారు. అయితే చైనాలోని మిగతా ప్రాంతాల్లోని జనం మాత్రం మాంసాహారాన్ని వీడలేదన్న వార్తలు కలవరపరిచాయి. 

 

ఇప్పుడు చైనాలో జరుగుతున్న పరిణామాలను గమనించిన వారు.. ఆ దేశంలో వైరస్‌ సెకండ్‌ వేవ్‌కు బీజం పడిందని  అనుమానిస్తున్నారు. ఒక్క కరోనానే కాదు.. గతంలో గడగడలాడించిన సార్స్‌ సైతం సీ ఫుడ్‌ మార్కెట్ల నుంచే వ్యాప్తి చెందిందని  చెబుతుంటారు. అంతెందుకు గత 50 ఏళ్లలో వెలుగులోకి వచ్చిన రకారకాల వైరస్‌లలో చాలా వరకూ  జంతు మాంసం నుంచి వచ్చినవే.  మూడు నెలపాటు నోళ్లు కట్టేసుకున్న జనం ఇక ఉండబట్టలేకపోతున్నారు. ప్రపంచ దేశాల్లో వైరస్‌ ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టకపోయినా.. అక్కడి ప్రజలు నిర్లక్ష్య ధోరణిని వీడటం లేదు. 

 

వుహాన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత  అక్కడి ప్రజలు వీటి జోలికి వెళ్లకపోయినా..ఈ ప్రాంతానికి ఉన్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా జన సంచారం క్రమంగా పెరుగుతోంది. విదేశీయుల తాకిడి ఎలా ఉన్నా.. చైనాలోని కీలకమైన తొమ్మిది ప్రావిన్స్‌లను నేరుగా కనెక్ట్‌ చేస్తూ హైవేలు ఉన్నాయి. ఈ మార్గాలు ఎప్పుడూ రద్దీగా కనిపిస్తాయి. కొన్నాళ్లుగా వీటిపై వాహన, జన సంచారం లేదు. ఇప్పుడిప్పుడే అన్నీ కుదురుకుంటున్నాయి. 

 

అయితే కొత్తగా వైరస్‌ ప్రభావం చూపుతుండటం.. వెంటనే  లక్షణాలు బయటపడే అవకాశం లేకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఒకవేళ వైరస్‌ చాపకింద నీరులా మళ్లీ చుట్టేస్తున్నా.. అది బయటపడటానికి కొంత సమయం పట్టొచ్చు. అప్పటిగానీ తీవ్రత అర్థం కాదు. పైగా చికిత్సలో వైరస్‌ తగ్గినట్లు గుర్తిస్తున్నా.. అది శరీరంలో ఎక్కడో ఒక చోట నిద్రాణమై తర్వాతి కాలంలో యాక్టివ్‌ కావడం కరోనా మహమ్మారికి ఉన్న మరో కీలక అంశం. ఒకవేళ వైరస్‌ సోకితే దగ్గు, జ్వరం వంటి తేలికపాటి లక్షణాలతోనే 80 శాతం మంది  కోలుకునే అవకాశం ఉంది. పది నుంచి 20 శాతం మందికే ఆస్పత్రిలో నిత్యం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయాల్సి ఉంటుంది. వైరస్‌ ఊపిరితిత్తులను చుట్టేస్తే మాత్రం ఆరోగ్యం విషమించినట్లుగానే భావిస్తారు. 


ఇప్పటికే  పూర్తి సన్నద్ధతతో  చైనా ఉంది. రెండోసారి వైరస్‌ విజృంభిస్తే మునుపటి కంటే వేగంగా స్పందించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే వైరస్‌ తన రూపు మార్చుకుంటే మాత్రం కొత్త సవాళ్లు ఎదురైనట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: