మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేయడంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మోదీ ప్రకటనపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధాని తాను కొన్ని రోజుల క్రితం లేఖ రాశానని ఆ లేఖలో కరోనా నియంత్రణ కోసం కొన్ని సూచనలు చేశానని పేర్కొన్నారు. నిన్న ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి ప్రధానితో మాట్లాడాలని కోరానని చెప్పారు. 
 
అయితే ఈరోజు ఉదయం 8.30 గంటలకు మోదీ తనకు ఫోన్ చేశారని... మోదీతో తన ఆలోచనలను పంచుకున్నానని తెలిపారు. లాక్ డౌన్ తో కంటికి కనిపించని శత్రువైన కరోనాతో పోరాడగలుగుతున్నామని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు కరోనా పెను సవాల్ అయినప్పటికీ ఇలాంటి సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రజలు చాలా ప్రాంతాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. క్రమశిక్షణగా ఉంటే తప్ప కరోనాను నియంత్రించడం సాధ్యం కాదని అన్నారు. 
 
అగ్ర దేశాలు కూడా కరోనా వల్ల అతలాకుతలం అవుతున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాల్లో కరోనా వల్ల మారణ హోమం జరుగుతోందని అన్నారు. దేశంలో లాక్ డౌన్ తర్వాత 70 శాతం కేసులు పెరిగాయని చెప్పారు. కరోనా పరీక్షలు దేశంలో తక్కువగా జరుగుతున్నాయని వాటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఏపీలో ల్యాబ్ ల సంఖ్య చాలా తక్కువగా ఉందని వాటిని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించి కరోనా కట్టడి చేయాలని అన్నారు. 
 
చాలా రోజుల తరువాత చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో ప్రజలకు కరోనా నియంత్రణ గురించి సలహాలు, సూచనలు ఇస్తూ హుందాగా వ్యవహరించారు. ప్రజలకు విశ్వాసం కలిగించేలా చంద్రబాబు అద్భుతంగా మాట్లాడారు. ఈ ఒక్క విషయంలో మాత్రం బాబు గారు బెస్ట్ అనిపించుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి తాను లేవనెత్తిన డిమాండ్ల ద్వారా అద్భుతాలు జరుగుతాయని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కష్ట కాలంలో కూడా రాజకీయ పరమైన అంశాల గురించి వ్యాఖ్యలు చేస్తూ అధికార పార్టీని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: