కరోనా దెబ్బకు ఒంగోలు గ్రానైట్‌ పరిశ్రమ కష్టాల్లో పడింది. చీమకుర్తిలో ఫ్యాక్టరీలన్నీ మూతపడటంతో క్వారీల్లోనే గ్రానైట్‌ అంతా నిలిచిపోయింది. ఇక్కడి గ్రానైట్‌ లో ఎక్కువ భాగం చైనాకే ఎగుమతి చేస్తారు. కరోనా, లాక్‌ డౌన్‌ పరిస్థితుల మధ్య చీమకుర్తి గ్రానైట్‌ కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. 

 

కరోనా వైరస్ ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టింది. లాక్ డౌన్ తరువాత జిల్లాలో ఉన్న వందలాది గ్రానైట్ ఫ్యాక్టరీలు పూర్తిగా మూతపడ్డాయి. జిల్లా నుంచి చైనాకి గ్రానైట్‌ ఎగుమతులు నిలిచిపోవడంతో ఇక్కడి పరిశ్రమ కష్టాల్లో పడింది. ఏటా 1500 కోట్ల వ్యాపారం జరిగే గ్రానైట్ పరిశ్రమల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది.

 

చీమకుర్తి నుండి వెలికి తీసే గ్రానైట్ లో 90 శాతం చైనాకి ఎగుమతి అవుతుంది. కరోనా అనంతర పరిణామాలతో చైనాకి పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో వెలికి తీసిన గ్రానైట్ ఎక్కడికక్కడే క్వారీల్లో నిలిచిపోయింది. దీంతో ఏపిలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గ్రానైట్ పరిశ్రమలు నెల రోజులుగా పూర్తిగా మూతపడ్డాయి.  వేలాది మంది కార్మికుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది.

 

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దొరికే  గెలాక్సీ గ్రానైట్ ప్రపంచంలో మరెక్కడా దొరకదు. అందుకే దీనికి అంతర్జాతీయ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. గెలాక్సీ గ్రానైట్ లో 90 శాతం  చైనా బయ్యర్లే కొనుగోలు చేస్తారు. వీటితోపాటు స్టీల్ గ్రే, బ్లాక్ పెరల్ రకాలు కూడా లభిస్తాయి. ఇక చిత్తూరు జిల్లాలో బ్లాక్, జీ20, విస్కాన్ వైట్, శ్రీకాకుళం జిల్లాలో బ్లూ, విశాఖలో రివర్ వైట్, మూన్ వైట్ రకాలు కూడా దొరుకుతాయి. 

 

ఓవరాల్ గా 1500 కోట్ల రూపాయలకు పైగా  వ్యాపారం చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమ ద్వారా జరుగుతుంది. దీంతో పాటూ జిల్లాలోని బల్లికురవ మండలంలో దొరికే స్టీల్ గ్రే గ్రానైట్ కి కూడా మంచి డిమాండ్ ఉంది. చీమకుర్తి తో పాటూ బల్లికురవ మండలాల్లో విస్తరించిన గ్రానైట్ పరిశ్రమలను  నమ్ముకుని వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో పాటు, లాక్ డౌన్ కారణంగా జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ భవిష్యత్తు అయోమయంగా మారింది.

 

జిల్లాలో చీమకుర్తితో పాటు బల్లికురవలో  ఉన్న గ్రానైట్ కొనుగోలు కోసం ప్రతి నెలా వంద మందికి పైగా చైనా నుండి వ్యాపారులు వస్తుంటారు. అయితే చైనాలో కరోనా వైరస్ ప్రభావం మొదలైన తర్వాత రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చైనా బయ్యర్లు రాకపోవడంతో చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాల్లో వెలికి తీసిన గ్రానైట్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. 

 

చైనాకు చెందిన 50కి పైగా కంపెనీలు చీమకుర్తి గ్రానైట్ ని కొనుగోలు చేస్తుంటాయి. కంపెనీల ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి గ్రానైట్ నాణ్యత పరిశీలించి, ఎంత కావాలో కొలతలు వేసి నిర్ధారిస్తారు. ఆ మేరకు ముడి గ్రానైట్‌ ను పోర్టుల నుంచి ఎగుమతి అయ్యే వరకు ఇక్కడే ఉండి చూసుకుంటారు. చీమకుర్తి ప్రాంతం నుంచే నెలకు సగటున 25- 30 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ చైనాకు వెళ్తుంది. వీటి సీనరేజ్ రూపంలోనే గనుల శాఖకు ఏటా రూ.180 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. గ్రానైట్ కోసం సగటున 200 మంది వరకు చైనా కంపెనీల ప్రతినిధులు నిత్యం ప్రకాశం జిల్లాలో మకాం వేసి ఉంటారు.

 

చైనాలో కరోనా ప్రభావం, ప్రభుత్వ ఆంక్షలతో మన రాష్ట్రంలో ఉన్న చైనీయులు వెనుతిరిగి వెళ్లిపోయారు. చీమకుర్తి గ్రానైట్ కోసం వచ్చి ఉన్న 120 మంది కూడా స్వదేశానికి వెళ్లిపోయారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఎప్పుడొస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. ఇది గ్రానైట్ ఎగుమతులపై చాలా ప్రభావం చూపనుంది. మరోపక్క గ్రానైట్ లీజుదారులు, యంత్రాల కోసం చైనా వెళ్లే పాలిషింగ్ యూనిట్ల యజమానులు కూడాప్రయాణాలు రద్దు చేసుకున్నారు. చైనాలోని జియామిన్ పోర్టులో నిర్వహించాల్సిన అంతర్జాతీయ స్థాయి స్టోన్ ఫెయిర్‌ నూ వాయిదా వేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: