కరోనా వైరస్‌తో ప్ర‌పంచం అంతా అతాల‌కుతలం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హమ్మారితో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు తీవ్రంగా ప్ర‌భావితం అవుతున్నాయి. దీంతె అనేక సంస్థ‌లు ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. ఇలాంటి ప్రస్తుత తరుణంలో భారీ స్థాయిలో కొత్త ఉద్యోగాల ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ ఏకంగా 75 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలోని ఉద్యోగార్థుల్లో సంతోషం వ్య‌క్తం అవుతోంది.

 

కరోనా వైరస్ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ ప‌లు కీలక నిర్ణయాలు తీసుకుంది. భార‌తదేశమంతా లాక్‌డౌన్ విధించ‌డంతో అమెజాన్‌ కొత్త ఆర్డర్లు స్వీకరించలేదు. అనంత‌రం మ‌రో కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. గతంలోనే ఆర్డర్స్‌ ఇచ్చిన వారికి సంబంధిత వస్తువులు గోడౌన్ల నుంచి బయటికి వెళ్లినప్పటికీ వాటి డెలివరీని తాత్కాలిక నిలిపివేసినట్లు ప్రకటించింది. కేవలం అత్యవసర (ఎమర్జన్సీ ఉత్పత్తులు) ఉత్పత్తులకు సంబంధించిన వస్తువుల ఆర్డర్లు తీసుకోవడంతో పాటు వాటి డెలివరీని కూడా నిర్ణీత సమయంలో అందిస్తామని స్పష్టం చేస్తుంది. అయితే అత్యవసర ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులను కూడా ముందుగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు (ప్రీ ఆన్‌లైన్‌ ప్రేమెంట్‌) జరిపిన వారికే అందిస్తామని ప్రకటించింది. గతంలో వ‌లే క్యాష్‌ డెలివరీ కొనసాగిస్తే కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తికి దోహదపడినట్లవుతుందని భావించిన అమెజాన్‌ నో క్యాష్‌ డెలివరీకి నిర్ణయం తీసుకుంది. 

 

అయితే, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. ఇది వరకు విధించిన లాక్​ డౌన్​ గడువును మరింత పొడగిస్తూ మే 3 వరకూ నిర్దేశించిన నేప‌థ్యంలో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సంస్థ గిడ్డంగుల నుంచి సరుకు రవాణా కోసం అత్యధిక మందిని రిక్రూట్‌ చేసుకోనున్నట్లు అమెజాన్​ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్ర‌మంలో దాదాపు 75000 మందిని నియ‌మించుకొని వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తామ‌ని వెల్ల‌డించింది. కాగా, ఈ ప్ర‌క‌ట‌న ఉద్యోగార్థుల్లో అనేక ఆశ‌లు నింపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: