కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.  దీంతో మరో 19 రోజుల పాటు దేశం లాక్‌డౌన్‌లోనే కొనసాగనుంది. అయితే మొదటి విడత లాక్ డౌన్ 21 రోజులు కొనసాగిన విషయం తెలిసిందే.

 

అలాగే మార్చి 22న దేశమంతా జనతా కర్ఫ్యూ, ఏప్రిల్ 5న కరోనాపై పోరాటంలో భాగంగా రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆపేసి, దీపాలు వెలిగించి మద్దతు తెలిపే కార్యక్రమం చేశారు. అయితే ఈ కార్యక్రమాలన్నింటికి మొత్తం ప్రజలు, ప్రతిపక్ష పార్టీల మద్దతు మోదీకి దక్కింది. కానీ ఇప్పుడు రెండో సారి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రతిపక్షాల స్వరం మారింది.

 

లాక్ డౌన్ సమర్ధిస్తూనే, ప్రధాని లక్ష్యంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆర్ధిక వ్యవస్థ విషయంలో ప్రతిపక్షాలు మోదీని టార్గెట్ చేసాయి. మోదీ లాక్ డౌన్ విధిస్తున్నట్లు మాత్రమే చెబుతున్నారని, అసలు ఆర్ధిక పరిస్థితి ఏంటి, పేదలకు ఎలాంటి సాయం చేస్తున్నారు, వలస కూలీల పట్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పడం లేదని కాంగ్రెస్ తో సహా, పలు రాష్ట్రాల్లోని విపక్షాల ఆధ్వరంలో నడుస్తున్న ప్రభుత్వాలు మోదీని ప్రశ్నిస్తున్నాయి.

 

ఇక మే 3 వరకూ పొడగించినా, మనం ఆశించిన ఫలితాలు రాకపోతే పరిస్థితి ఏంటని,  అప్పటికీ కేంద్రం వద్ద ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అని ప్రశాంత్ కిశోర్ లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే వలస కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో బాంద్రా, సూరత్ ఘటనలు ఉదాహరణగా ఉన్నాయని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే చెబుతున్నారు. అయితే ఇలా విపక్షాలు చేసే విమర్శలకు అర్దంమున్నాయని, అదే సమయంలో కరోనా వ్యాప్తికి కృషి చేస్తూ, పేదలని ఆదుకోవడంలో కేంద్రం సరైన చర్యలే తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: