కరోనా ప్రభావం ప్రపంచంపై ఎలా ఉండబోతోంది.. ఇది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఆ దేశం.. ఈ దేశం అని సంబంధం లేకుండా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుందీ కరోనా.. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అర్థం కాదు.. ఇంకా ఎన్ని వేల ప్రాణాలు బలి తీసుకుంటుందో అర్థం కాదు.. మళ్లీ ఎప్పుడు సాధారణ జీవితం గడుపుతామో తెలియదు..

 

 

ప్రపంచం ఇంతకు ముందెన్నడూ అనుభవించనంత అనిశ్చితి ఇప్పుడు చోటు చేసుకుంది. దీంతో భవిష్యత్ పై అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఈ అంశం అనేక సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసే ఐఎం ఎఫ్ కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలోకి జారిపోయిందని చెప్పేసింది.

 

 

ఈ సంస్థ అంచనా ప్రకారం 1930నాటి మాంద్యం తరువాత అంత దారుణ ఆర్థిక స్థితి ఇది. 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ – 0.3 శాతం క్షీణత నమోదు చేసుకుంటుందని అంచనా వేసింది. వాస్తవానికి ఈ అంచనా జనవరిలో 6.3%గా ఉండేది. చూశారా మూడు నెలల్లోనే ఎంత దారుణమైన ఫలితాలు వచ్చాయో.. ఇది ఇక్కడితో ఆగుతుందన్న నమ్మకమూ కలగడం లేదు.

 

 

ఇక భారత్ కు సంబంధించి 2020 జనవరి అంచనా 5.8 శాతం గా ఉండేది. కానీ ఇప్పుడు అదే సంస్థ తన అంచనాను 1.9 శాతానికి కుదించింది. అయితే 2021 భారత్‌ వృద్ధిరేటు 7.4 శాతం, చైనా 9.2 శాతం వృద్ధి నమోదు చేసుకుంటాయని విశ్లేషించడం కాస్త ఊరట కలిగించే అంశం.. మొత్తం మీద తేలేదేమంటే.. ముందున్నవి గడ్డు రోజులు.. దీని గురంచి మరీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా.. దీన్ని విస్మరించడం మాత్రం మంచిది కాదు. అందుకే ఇంకాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. మన ప్రణాళికలను ఆ మేరకు సరిదిద్దుకోవడం ఉత్తమం. ఎందుకంటే.. కీడెంచి మేలెంచమంటారు కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: