అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ దాదాపు రెండు వేల మంది కరోనా కారణంగా మరణిస్తున్నారు. న్యూయర్క్ వంటి నగరాలైతే గతంలో ఎన్నడూ లేనంతగా అల్లాడిపోతున్నాయి. ఈ కరోనా నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి నిర్లక్ష్యంగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ట్రంప్ మాత్రం కరోనా విషయంలో చైనాను మొదటి నుంచి తప్పుబడుతున్నారు.

 

 

కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా చైనా సరైన చర్యలు తీసుకోలేదని.. మిగిలిన దేశాలకు సమాచారం ఇవ్వలేదని.. తన పౌరులను దేశం దాటకుండా కట్టడి చేయలేదని.. మండిపడుతున్నారు. కేవలం చైనా మీదే కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOపైనా ఆయన మండిపడుతున్నారు. ఈ సంస్థ చైనాతో కుమ్మక్కై ప్రపంచాన్ని హెచ్చరించలేదని ఆరోపిస్తున్నారు. చైనా సహా ఇతర దేశాల ప్రయాణాలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించడం డబ్ల్యూహెచ్‌ఓ తీసుకొన్న అత్యంత వినాశకరమైన నిర్ణయంగా ఆయన వర్ణిస్తున్నారు.

 

 

ఈ నేపథ్యంలో ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఆయన కొంతకాలంగా WHOకు నిధులు ఆపేస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు అన్నంత పని చేశారు. తమ దేశం తరఫున సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్ అధికారుల్ని ఆదేశించారు. అంతే కాదు.. కరోనా వైరస్‌ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో WHO విఫలమైందన్న ఆరోపణలపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనా విషయంలో WHOసంస్థ చైనాకు పక్షపాతిగా వ్యవహరించిందని ఆయన మండిపడుతున్నారు.

 

 

WHO బాధ్యతాయుతంగా నడుచుకునేలా ఆదేశించే హక్కు సంస్థకు అత్యధిక నిధులు అందిస్తున్న అమెరికాకు ఉందని ట్రంప్‌ అంటున్నారు. WHOతో ఏకీభవించకుండా తాను చైనా ప్రయాణాలపై ఆంక్షలు అమలు చేసి.. చెప్పలేనంత మంది ప్రాణాల్ని రక్షించానని ట్రంప్ అంటున్నారు. ప్రపంచాన్ని కాపాడే విషయంలో WHO సంస్థ తన కనీస బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైందని ట్రంప్ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: