దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా విజృంభణతో గత నెలలో ప్రధాని మోదీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. నిన్న మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు. 
 
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశగా పయనిస్తోంది. గడచిన 21 రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు 2,35,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం కేవలం మూడు రంగాలకు సంబంధించిన నష్టం మాత్రమేనని సమాచారం. అన్ని రంగాల నష్టాలను అంచనా వేస్తే 7 లక్షల కోట్ల రూపాయల నుంచి 8 లక్షల కోట్ల రూపాయల వరకు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పెట్రోల్, నిత్యావసర వస్తువులు, లగ్జరీ గూడ్స్ వల్ల గత 21 రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు 2,35,000 కోట్ల రూపాయలు చేకూరేది. ఈ ఆదాయం ఎట్టి పరిస్థితుల్లోను రికవరీ చేయడం సాధ్యం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వీటి ద్వారా వచ్చే ఆదాయం దాదాపు ఆగిపోయినట్టే అని చెప్పవచ్చు. భవిష్యత్తులో కూడా ఈ ఆదాయాన్ని రికవరీ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోను సాధ్యం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
మరోవైపు లాక్ డౌన్ వల్ల రైళ్లు, విమానాలు, బస్సులు ఆగిపోయాయి. పరిశ్రమలు, వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా కార్యకలాపాలన్నీ స్తంభించాయి. కరోనా మార్చి నెల మొదటి వారం నుంచే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: