ఏడుకొండ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామికి భ‌క్తులు కానుక‌ల రూపంలో స‌మ‌ర్పించిన మొత్తాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బాధ్యులు క‌రోనా ఆప‌త్కాలంలో సాయం పేరిట ఇష్టానుసారంగా నిధులను ఖ‌ర్చుచేయ‌డంపై  తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద సంప‌న్న ఆల‌యంగా టీటీడీకి పేరుంది. సంవ‌త్స‌రంలో వంద‌లాది కోట్ల రూపాయాలు స్వామివారికి కానుక‌ల రూపంలో భ‌క్తులు చెల్లిస్తున్నారు. అదీగాక  టెండ‌ర్లు, వివిధ ర‌కాల మార్గాల ద్వారా కూడా పెద్ద మొత్తంలో నిధులు స‌మ‌కూరుతుంటాయి. ఇలా స‌మ‌కూరిన నిధుల‌తో స్వామివారి ఆల‌య నిర్వ‌హ‌ణతో పాటు పెద్ద ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. 

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్ర‌మాల‌కు, హిందు మ‌తానికి సంబంధించిన సేవా కార్యక్ర‌మాల‌కు వినియోగిస్తూ వ‌స్తున్నారు. తాజాగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలోకి ఎవ‌రిని అనుమ‌తించ‌డం లేదు. స్వామివారికి అంత‌రంగిక సేవ కార్య‌క్ర‌మాలు, పూజ‌లు కొన‌సాగుతున్నాయి. భ‌క్తుల సంద‌డి లేక ఏడు కొండ‌లు వెల‌వెల‌బోతున్నాయి. అలాగే లాక్‌డౌన్ అమ‌లుతో కొండ‌పై ఉన్న వ్యాపార దుకాణాలు కూడా మూత‌ప‌డ్డాయి. భ‌క్తులు లేక‌పోవ‌డంతో ఆల‌యానికి ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. అలాగే వ్యాపారుల‌కు గ‌డ్డు ప‌రిస్థితులే ఎదుర‌వుతున్నాయి. చిన్న‌చిన్న వ్యాపారులైతే పూట‌గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా ఉంది. 

 

టీటీడీ బాధ్యులు జిల్లాకు కోటి రూపాయ‌ల చొప్పున విరాళం ప్ర‌క‌టించిన భోజ‌నాల పంపిణీ చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. సేవా కార్యక్ర‌మాల‌ను చేప‌ట్ట‌డం ఆహ్వానించ‌ద‌గ్గ విష‌య‌మే అయిన‌ప్ప‌టికీ ఇంత‌పెద్ద మొత్తంలో అదీ కూడా  ఓ లెక్కా ప‌త్రం లేని విధానంలో ఖ‌ర్చు చేయ‌డానికి అనుమ‌తులివ్వ‌డంపై భ‌క్తులు మండిప‌డుతున్నారు. ఆయా ప్రాంతాల్లో స్వ‌చ్ఛంద సంస్థ‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతూనే ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ విరాళాల‌తో సేవా కార్య‌క్ర‌మాల‌తో కొత్త‌గా ఒరిగేదేమీ ఉండ‌దని చెబుతున్నారు. కొండ‌పై ఎంతోమంది పేద‌లు వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నా ప‌ట్టించుకోని టీటీడీ అధికారులు, బాధ్యులు ప‌నిగ‌ట్టుకుని జిల్లాల్లో నిధులు ఖ‌ర్చు చేయ‌డానికి పూనుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. సేవ ముసుగులో కాంట్రాక్ట‌ర్ల జేబుల్లోకి డ‌బ్బులు చేరేందుకు త‌ప్పా టీటీడీ తీసుకున్న నిర్ణ‌యం దేనికి ప‌నికి రాద‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: