దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా మొదట మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో విజృంభించింది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా కేరళలో మాత్రం కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఈరోజు కేరళలో కేవలం ఒక కేసు మాత్రమే నమోదైంది. కేవలం ఒకే ఒక్క కేసు నమోదు కావడంతో కేరళ దేశ ప్రజల హృదయాలను కొల్లగొట్టింది. 
 
రాష్ట్రంలో 387 కేసులు నమోదు కాగా 167 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోందని కేరళ ప్రభుత్వం ప్రకటన చేసింది. దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో కేరళ సక్సెస్ అయింది. దేశాలకు, ఇతర రాష్ట్రాలకు స్పూర్తిగా నిలిచింది. అనేక రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ఈరోజు కేరళలో ఒకే ఒక కేసు నమోదైంది. కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. 
 
ఒకటి రెండు రోజుల్లో కేరళలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చేయడం, ప్రతి కరోనా పాజిటివ్ రోగికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రయాణ చరిత్రకు సంబంధించిన వివరాలు సేకరించడం ఎప్పటికప్పుడు వారి వివరాల ద్వారా ఇతరులను అలర్ట్ చేస్తూ కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ అయింది. 
 
మరోవైపు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 12,000 కరోనా కేసులు నమోదు కాగా దాదాపు 400 మంది మృతి చెందారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈరోజు ఉదయం వరకు ఏపీలో 502 కేసులు నమోదు కాగా తెలంగాణలో 644 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: