రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లో ప్రతిరొజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న హాట్ స్పాట్ జిల్లాల జాబితాను విడుదల చేసింది. కేంద్రం దేశవ్యాప్తంగా 170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్‌లుగా, 207 జిల్లాలను నాన్ హాట్‌స్పాట్‌లుగా, మిగిలిన జిల్లాలను గ్రీన్ జోన్లుగా గుర్తించినట్లు ప్రకటన వెలువడింది. 
 
కేంద్రం మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించడంతో కరోనా వ్యాప్తిని నివారించేందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల హాట్ స్పాట్ జిల్లాల జాబితా కూడా ఈరోజు విడుదలయింది. జిల్లాల జాబితా ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లకు చేరింది. 
 
కేంద్రం ఏపీలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, అనంతపూర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, కృష్ణ, ప్రకాశం , చిత్తూరు, వైజాగ్ జిల్లాలను హాట్ స్పాట్ జిల్లాలుగా ప్రకటించింది. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలను కేంద్రం హాట్ స్పాట్ జిల్లాలుగా గుర్తించడం గమనార్హం. 
 
కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి జిల్లాలను హాట్ స్పాట్ జిల్లాలుగా నల్గొండ జిల్లాను హాట్ స్పాట్ క్లస్టర్ జిల్లాగా ప్రకటించింది. కేంద్రం ఆరెంజ్ జోన్ జిల్లాలుగా కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల ప్రకటించింది. కేంద్రం 14 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే హాట్ స్పాట్ జిల్లాలను నాన్ హాట్ స్పాట్ జిల్లాలుగా... నాన్ హాట్ స్పాట్ జిల్లాలను గ్రీన్ జోన్ జిల్లాలుగా మారుస్తామని ప్రకటన చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: