దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు కొంత సైలెంట్ గానే ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం చాలా వరకు తగ్గింది. అయితే తాజాగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. జగన్ పాలన గుడ్డి ఎద్దు చేలో పడి మేసినట్లుగా ఉందని మండిపడ్డారు. 
 
వైసీపీ ప్రభుత్వం కమ్మ కమ్మ అంటూ ప్రతి విషయంలో కులాన్ని లాగుతోందని అన్నారు. అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ప్రభుత్వ పోస్టుల్లో ప్రాధాన్యత ఇస్తోందంటూ ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు ప్రతి విషయంలో కమ్మ, కమ్మ అంటూ గోల చేస్తున్నారని... కమ్మ అని తెలిస్తే చాలు తీసి పక్కన పడేస్తున్నారని చెప్పారు. ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదని జగన్ కు సూచించారు. 
 
జగన్ కమ్మవారు తలుచుకుంటే లేచిపోతాడని... కమ్మవారు ఏం చేస్తారులే అని అనుకోవద్దని హెచ్చరించారు. ఎన్నికల కమిషనర్ ను మార్చాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పారు. ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయకపోయి ఉంటే రాష్ట్రంలో వేల మంది కరోనా భారీన పడేవారని పేర్కొన్నారు. 
 
అమరావతి విషయంపై . కరోనా తగ్గిన తర్వాత మోదీతో చర్చిస్తానని తెలిపారు. రాజధానిని మార్చాలని జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో వైసీపీ జీరో అవుతుందని అభిప్రాయపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ ఓటమి ఖాయమని రాయపాటి సాంబశివరావు జోస్యం చెప్పారు. జగన్ కరోనా వైరస్ ను చాలా తేలికగా తీసుకున్నారని... జగన్ కనీసం మంత్రులకు కూడా అందుబాటులో  ఉండటం లేదని అన్నారు. రాయపాటి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: