లాక్‌డౌన్‌తో నేరుగా దెబ్బతిన్న రంగం వ్యవసాయం.  పంటలు చేతికొచ్చే సమయంలో కరోనా పిడుగు పడింది. ఉద్యాన, వాణిజ్య పంటలదీ ఇదే దుస్థితి. వ్యవసాయ ఆధారిత మార్కెట్‌ మొత్తం ఢీలా పడిపోయింది. పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువే ఉన్నా.. రైతుకు కష్టాలు తప్పడం లేదు. 

 

తెలంగాణలో వ్యవసాయం... ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.  ఇలాంటి సమయంలో కరోనా రూపంలో అకాల కష్టం కాటేసింది. వరి పండించటంలో టాప్‌లో ఉంటోంది. ఏటా 17లక్షల ఎకరాల్లో వరిసాగు ఉండేది. ప్రస్తుతం నీటి లభ్యత పెరగడంతో సాగు విస్తీర్ణం రెట్టింపు అయింది. ఈ సీజన్‌లో వరి 20 లక్షల హెక్టార్లలో సాగయ్యింది. 66.22లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. దీంతో రైతులకు సుమారు 35వేల కోట్లు ఆదాయం వస్తుందని లెక్కలు వేశారు. 

 

తెలంగాణలో ఎక్కువగా సాగు చేసే వాటిల్లో మొక్కజొన్న కూడా ఒకటి. ఈ దఫా 7.52 హెక్టార్లులో సాగు చేశారు. 35.25 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. నీటి లభ్యతలేని ప్రాంతాల్లో పత్తిసాగు కూడా చేస్తుంటారు. నల్గొండ జిల్లాల్లో ఇది ఎక్కువ. మొత్తంగా 17.13 లక్షల హెక్టార్లలో కాటన్‌ సాగు చేశారు. 42.65 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. పత్తి సమస్య ఇప్పుడు చాలా తక్కువే అని చెప్పాలి. 

 

ఇప్పుడు సమస్యంతా వరి రైతులదే. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం ఎక్కడికక్కడే కొనుగోలు చేయాలని.. మద్దతు ధర కూడా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. రైతుల చేతికి వెంటనే నగదు అందే పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలు సమస్య ఉండదు కానీ... మిగిలిన పంటలకు సంబంధించిన క్రయ విక్రయాలకు పెద్ద సమస్య వచ్చి పడింది.

 

ఉద్యాన పంటలు వేసిన రైతుల కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో బత్తాయి, నిమ్మ సాగు ఎక్కువ. ఈ జిల్లాల్లో ధాన్యం నిల్వకు సదుపాయాలు ఉన్నా... బత్తాయి, నిమ్మ పంటల నిల్వకు ఎలాంటి వసతుల లేవు. బత్తాయి, నిమ్మతో పాటు మామిడి కాయలను సైతం కోసిన తర్వాత తోటల్లోనే కుప్పలుగా ఉంచేస్తారు. ఏప్రిల్‌, మే నెలలో మామిడికాయ కొనుగోళ్లు ఎక్కువగా సాగుతాయి. లాక్‌డౌన్‌ వల్ల మామిడి రవాణా లేదు. వీటి అనుబంధ పరిశ్రమలు కూడా మూతపడటంతో రైతులు తల పట్టుకుంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధర తగ్గించేశారు. గత ఏడాది ఈ మూడు ఉద్యాన పంటలకు మంచి ధర వచ్చింది. ఈ ఏడాది కూడా అదే ఆశతో పంటలు వేసినవారు  మునిగిపోయారు. సిట్రస్‌ రకాలను ధరలు లేవని తక్కువకు అమ్ముకోవద్దని.. డీహైడ్రేషన్‌  విధానంలో నిల్వ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 


 
తెలంగాణలో నీటి లభ్యత పెరుగుతుండటంతో.. సంప్రదాయ పంటలు వేసే రైతులు కూడా వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. తర్బూజా.. కర్బూజాల సాగు పెరిగింది. ఏ విధంగా చూసినా రకరకాల పండ్లసాగు గతం కంటే ఎంతో మెరుగ్గా ఉంది. అయితే ఏం లాభం. లాక్‌డౌన్‌ వల్ల పంట రవాణా లేదు. దీంతో ఉద్యాన, వాణిజ్య పంటలు సాగు చేసి రైతులు ఆర్థిక ఇబ్బందుల్లోకి జారుకునే ప్రమాదం కనిపిస్తోంది. 

 

వాస్తవానికి రబీ పంట చేతికి వచ్చి.. మార్కెట్లో ఉత్పత్తులు అమ్ముకోవడానికి మే నెలాఖరు వరకూ పడుతుంది. కానీ.. మొదట్లోనే ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో జూన్‌ మొదటి వారంలో ఖరీఫ్‌ పనులు ప్రారంభం అవుతాయి. రబీ ఉత్పత్తులు అమ్ముడై చేతికి కాస్తో కూస్తో డబ్బులు వస్తేనే.. అన్నదాత ఖరీఫ్‌ పనులు ప్రారంభించానికి కాస్త ధైర్యం లభిస్తుంది. ఇలాంటి  పరిస్థితుల్లో  విత్తనాల కొనుగోలు, సాగు పనులు అంటే  అప్పులు చేయకతప్పని దుస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకులు రైతులకు ఎంత వరకూ రుణాలిస్తాయనేది కూడా అనుమానమేనని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: