ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఉద్దేశించి  మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌భుత్వ పోస్టుల్లో రెడ్డి సామాజిక వ‌ర్గానికే పెద్ద‌పీట వేస్తున్నారంటూ ఆరోపించారు. అంతేకాదు  ప్రతి విషయంలోనూ వైసీపీ ప్ర‌భుత్వం కమ్మ సామాజిక వ‌ర్గం అంటూ రాజ‌కీయం చేసే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని అన్నారు. కమ్మ సామాజికవర్గం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప్ర‌మోష‌న్లు ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. క‌మ్మ‌వారు ఏంచేస్తారులే అన్న నిర్ల‌క్ష్య‌ధోర‌ణి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిలో క‌నిపిస్తోంద‌ని, ఇది ఆయ‌న ప్ర‌భుత్వానికి మంచిది కాద‌ని హెచ్చ‌రించారు. క‌మ్మ సామాజిక వ‌ర్గం త‌లుచుకుంటే అధికారంలో లేకుండా పోతాడంటూ ఘాటుగా స్పందించారు. 

 

 బుధ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ  ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయకపోతే ఈపాటికి రాష్ట్రంలో కొన్ని వేల మంది చనిపోయే వారని అన్నారు. కేవ‌లం త‌న పంతం నెగ్గ‌లేద‌ని, ఎన్నిక‌ల‌ను వాయిదా వేశాడ‌నే కోపంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించడం జ‌గ‌న్‌ విప‌రీత మ‌న‌స్త‌త్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు.  ఇక రాజధాని మార్పు జ‌రిగితే మాత్రం వైసీపీ రాష్ట్రంలో జీరో అవుతుందని రాయపాటి జోస్యం చెప్పారు. కరోనా సమస్య తగ్గిన తర్వాత అమరావతి అంశంపై  తాను స్వ‌యంగా వెళ్లి ప్రధాని మోదీతో మాట్లాడతానని తెలిపారు. కరోనా వైరస్‌ను సీఎం జగన్ చాలా ఈజీగా తీసుకున్న ఫ‌లితంగానే నేడు రాష్ట్రంలో ఈ స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయ‌ని అన్నారు. 

 

ఇదిలా ఉండ‌గా  ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారితో రాష్ట్రం అల్లాడుతుంటే రాయ‌పాటి వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశమ‌య్యాయి. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో  ప్ర‌భుత్వం పూర్తిగా నిమ‌గ్నమైన విష‌యం తెలిసిందే.మరో నాలుగైదు రోజుల్లో కోవిడ్‌ –19 పరీక్షల రోజువారీ సామర్థ్యం 2వేల నుంచి 4వేలకు పెంచేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది.  ప్రస్తుతం రాష్ట్రంలో క‌రోనా నియంత్ర‌ణ‌లోనే ఉంద‌ని అధికార వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. అయితే రానున్న రెండు వారాలు అత్యంత కీల‌కంగా మారనున్నాయ‌ని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో కొత్త కేసులు త‌గ్గుముఖం ప‌డుతాయ‌ని 
ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: