ప్రపంచ ఆరోగ్య సంస్థకు ట్రంప్‌ షాకిచ్చారు. అమెరికా నుంచి ఇచ్చే నిధుల్ని పూర్తిగా ఆపేశారు. కరోనా వ్యాప్తిని WHO కప్పిపుచ్చిందనే ఆగ్రహంతో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు... కరోనాపై తాము సంధించే ప్రశ్నలకు బీజింగ్ సమాధానం చెప్పాలని... అమెరికా తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.

 

కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యతాయుతంగా పనిచేయలేదని మొదటి నుంచీ ఆరోపిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌... అన్నంత పనీ చేశారు. అమెరికా నుంచి WHOకు అందించే నిధుల్ని నిలిపివేశారు. వైరస్‌ వ్యాప్తి తీరుని WHO కావాలనే బయటపెట్టలేదంటున్న ట్రంప్‌... కరోనా వైరస్‌ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో WHO విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. 

 

చైనా సహా ఇతర దేశాల ప్రయాణాలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించడం WHO తీసుకొన్న 'అత్యంత వినాశకరమైన' నిర్ణయమన్నారు... ట్రంప్‌. కరోనా విషయంలో చైనాకు WHO పక్షపాతిగా వ్యవహరించిందని... ఆ సంస్థ బాధ్యతాయుతంగా నడుచుకునేలా ఆదేశించే హక్కు... అత్యధిక నిధులు అందిస్తున్న అమెరికాకు ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. తమ దేశం తీసుకున్న చాలా నిర్ణయాల్ని WHO వ్యతిరేకించిందని... అయితే, ఆ సంస్థతో ఏకీభవించని తాను చైనా ప్రయాణాలపై ఆంక్షలు అమలు చేసి... ఎంతో మంది ప్రాణాల్ని రక్షించానన్నారు. 

 

మరోవైపు... కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పుడే తమ వైద్య బృందానికి అనుమతి ఎందుకివ్వలేదని చైనాపై అమెరికా మంత్రి మైక్‌ పాంపియో తీవ్ర విమర్శలు చేశారు. బీజింగ్‌ తమ ప్రశ్నలకు జవాబులు చెప్పాలని, పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. చైనాలో ప్రయోగశాల, మాంసాహార విపణి ఉందని తెలిసినా... వైరస్‌ వుహాన్‌లోనే పుట్టిందని తెలిసినా... WHO ఎలాంటి చర్యలు తీసుకోలేదని... ఇప్పటికీ అమెరికాకు తెలియని సమాచారం ఎంతో ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పతనమైందని పాంపియో ఆవేదన వ్యక్తం చేశారు.

 

చైనాలో అసలు ఏం జరిగిందో అక్కడి ప్రభుత్వం చెప్పాలని అమెరికా డిమాండ్‌ చేసింది. చైనాలో కరోనా పరిస్థితి ఏంటి? ఎంత మంది చనిపోయారు? ఎన్ని కేసులున్నాయి? ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు? అనే వాటిపై నిజాలు వెల్లడించాలని కోరింది. అమెరికన్ల ఆరోగ్యానికి, జీవన శైలికి చైనా ఎనలేని ముప్పు తీసుకొచ్చిందన్న అగ్రరాజ్యం... కరోనాపై చైనా ప్రపంచానికి తప్పుడు సమాచారం చెప్పిందని మండిపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: