మే 3 వరకు పొడిగించిన లాక్‌డౌన్‌ కోసం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది కేంద్రం. ఈ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులతో పాటు వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఔషథ, భవన నిర్మాణ రంగాలకు... షరతులతో కూడిన అనుమతి ఉంటుందని తెలిపింది. అయితే, హాట్‌స్పాట్‌ ప్రాంతాలకు మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండబోవని... అక్కడ లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించింది.

 

కరోనా వైరస్‌ను దేశం నుంచి తరిమికొట్టేందుకు మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన 24 గంటల తర్వాత... దానికి సంబంధించిన మార్గదర్శకాల్ని విడుదల చేసింది... కేంద్రం. ఏప్రిల్‌ 19 వరకు దేశవ్యాప్తంగా కఠినంగా లాక్‌డౌన్‌ అమలవుతుందని చెప్పిన ప్రభుత్వం... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు... 20వ తేదీ నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చింది. ముఖ్యంగా వ్యవసాయ పనులతో పాటు... ఉత్పత్తుల సేకరణ, అమ్మకాలు-కొనుగోళ్లు.. మండీల నిర్వహణకు అనుమతి ఉంటుందని తెలిపింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్లలో కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతి లభించింది. గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు కూడా నిర్వహించుకోవచ్చని తెలిపింది. దాంతో పాటు వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు... విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుమందుల దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థల్ని కూడా యథావిథిగా నడుపుకొనేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

 

అలాగే పాడి, పౌల్ట్రీ పరిశ్రమలకు సంబంధించిన పనులు, వ్యాపారాలు చేసుకోవచ్చని... టీ, కాఫీ, రబ్బరు సాగు కొనసాగించవచ్చని కేంద్రం సూచించింది. ఆక్వా ఉత్పత్తుల క్రయ విక్రయాలకు కూడా ఏప్రిల్‌ 20 నుంచి ఆటంకాలు ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల్ని కూడా కొనసాగించుకోవచ్చు. ఔషధ పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాల్లో యథాతథంగా పనులు జరుపుకోవచ్చని, మెడికల్‌ షాపులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లను తెరుచుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాల్లో వెల్లడించింది.  పట్టణ పరిధిలోలేని అన్ని రకాల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నడుపుకోవడానికి కూడా అనుమతిచ్చింది. ఇక... ఇప్పటికే పని చేస్తున్న బ్యాంకులు కూడా యథావిథిగా నడుస్తాయి. వాటితో పాటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సేవలు... డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయి. ఇక ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50 శాతం సిబ్బందిని వినియోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. 


దేశవ్యాప్తంగా హోమ్‌ డెలివరీ సేవలు అందించే ఈ కామర్స్ సంస్థల కార్యకలాపాలకు కూడా కేంద్రం ఏప్రిల్‌ 20 నుంచి అనుమతి ఇచ్చింది. సరుకులు, వస్తువులు చేరవేసే ఆయా సంస్థల వాహనాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని వెల్లడించింది. పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ, ఆహార ఉత్పత్తులు, మందుల సరఫరా వంటి నిత్యావసరాలను రాష్ట్రాల సరిహద్దుల గుండా రవాణా చేయడానికి అనుమతిచ్చింది. రోడ్ల పక్కన దాబాలు, వాహన మరమ్మతు దుకాణాల వ్యాపారానికి కూడా అనుమతి లభించింది. భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు ఉంటాయన్న కేంద్రం... బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఎలక్ట్రీషియన్లు, మోటార్‌ మెకానిక్స్‌, కార్పెంటర్లు... తమ సేవలు అందించవచ్చని పేర్కొంది. అనాథ, దివ్యాంగ, వృద్ధాశ్రమాల నిర్వహణ కూడా కొనసాగించుకోవచ్చని తెలిపింది. 

 

కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విధులకు హాజరయ్యే ఉద్యోగులు, కార్మికుల రాకపోకలకు... ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. ఆ వాహనాల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉండకుండా 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ప్రయాణించాలని సూచించింది. ఈ వాహనాలతో పాటు కార్మికులు విధులు నిర్వహించే సామాగ్రిని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని ఆదేశించింది. ఈ సమయంలో విధులు నిర్వహించే వారికి మెడికల్‌ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి చేసింది. ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లలో శానిటైజర్ తప్పనిసరిగా ఉంచాలని, సోషల్ డిస్టెన్స్ అమలు చేసేందుకు ఉద్యోగులు షిఫ్ట్‌లు మారే సమయంలో గంట విరామం ప్రకటించాలని, ఆ సమయంలో శానిటైజేషన్‌ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపింది. కార్యాలయాల్లో ఒకరికొకరు కనీసం ఆరడుగుల దూరం పాటించాలని, లిఫ్ట్‌ల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఎక్కొద్దని సూచించింది. కార్యాలయాల్లో టెంపరేచర్‌ స్క్రీనింగ్‌ ఏర్పాట్లు తప్పనిసరి చేయాలని తెలిపింది. 65 ఏళ్ల పైబడినవారు, ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుంచే పనిచేయాలని కోరింది. 

 

ఇక ఏప్రిల్‌ 20 నుంచి మినహాయింపులు లభించని వాటి జాబితా కూడా పెద్దగానే ఉంది. మే 3 వరకూ అన్ని విమానాలు, రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సులు ఏవీ నడవవు. మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుంది. విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు మూసివేసే ఉంటాయి. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, బార్లు తెరుచుకోవు. రాజకీయ, సామాజిక సమావేశాలపైనా నిషేధం కొనసాగుతుంది. వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దులు దాటేందుకు వ్యక్తులకు అనుమతి ఇవ్వరు. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల్లో... 20 మందికి మించి పాల్గొనకూడదు. ఒకవేళ వివాహాలు, ఇతర శుభకార్యాలు జరుపుకోవాలంటే తప్పనిసరిగా కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. వ్యవసాయం, భవన నిర్మాణం సహా మరే ఇతర పనులకు... వేరే ప్రాంతాల నుంచి కూలీలను తరలించకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా విధిస్తారు. లిక్కర్, గుట్కా, పొగాకు అమ్మకాలపై నిషేధం కొనసాగనుంది. పది అంతకన్నా ఎక్కువమంది ఒక చోట గుమికూడడంపై నిషేధం కొనసాగనుంది. ఇవే కాదు... హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లోనూ ఎలాంటి మినహాయింపు

మరింత సమాచారం తెలుసుకోండి: