కరోనావైరస్ మహమ్మారి గల్ఫ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ‌కొట్టింది. ఇప్ప‌టికే అక్క‌డ అనేక ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. భ‌వ‌న నిర్మాణ ప‌నులు సాగ‌డం లేదు. లాక్‌డౌన్ అమ‌ల‌వుతుండ‌టంతో ప‌నిదొర‌క‌క‌..ఉన్న ప‌నికి గ్యారంటీ లేక భార‌తీయ కూలీలు, ఉద్యోగులు గ‌ల్ఫ్‌లో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఒక నివేదిక ప్ర‌కారం.. భార‌త‌దేశం నుంచి సౌదీ అరేబియా, కువైట్‌, ఒమ‌న్‌, దుబాయ్, బ‌హెర‌న్ వంటి గ‌ల్ఫ్ దేశాల్లో 89ల‌క్ష‌ల మంది ఉపాధి పొందుతున్నారు. ఇక తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి కూడా దాదాపు12ల‌క్ష‌ల‌కు పైగా గ‌ల్ప్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ్యాకింగ్ మ‌రియు ఆస్ప‌త్రుల్లో కేర‌ళ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు చెందిన వారు అత్య‌ధికంగా ప‌నిచేస్తుంటారు. 


ఇక తెలంగాణ నుంచి వెళ్లిన వారిలో ఎక్కువ‌గా పెట్రోల్ బావుల్లో,  భ‌వ‌న నిర్మాణ కార్మికులుగా ప‌నిచేస్తుంటారు. అంతేకాక షేక్‌ల ఇళ్ల‌ల్లో ప‌నిమ‌నుషులుగా ఉంటారు. గొర్రెల కాప‌రులుగా వేలాదిమంది ప‌నిచేస్తున్నారు. అయితే క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో గ‌ల్ఫ్ దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌న‌మైంది. ప్ర‌పంచ‌మంతా లాక్‌డౌన్ అమ‌ల‌వుతుండ‌టంతో పెట్రోల్‌కు ఏమాత్రం గిరాకీ లేదు. పెట్రోల్ వెలికితీత కూడా నిలిచిపోయింది. బ్యారెల్ ధ‌ర దారుణంగా ప‌డిపోయింది. స‌మీప భ‌విష్య‌త్‌లో పెట్రోల్‌కు డిమాండ్ ఏర్ప‌డుతుంద‌న్న న‌మ్మ‌కం లేదు. ఇక భ‌వ‌న నిర్మాణా ప‌నులు ఇప్ప‌ట్లో జ‌రిగేలా లేవ‌ని అక్క‌డి కార్మికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 


ఇదిలా ఉండ‌గా ప‌నిదొర‌క‌క అక్క‌డ ఖ‌ర్చులు భ‌రిస్తూ ఎంతోకాలం ఉండ‌లేమిన వారు పేర్కొంటున్నారు. మ‌రికొద్దిరోజుల్లో వారంతా ఇండియాకు తిరిగిరావ‌డానికి ఏర్పాట్లు చేసుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. గ‌ల్ప్ కార్మికుల రాక‌తో నిరుద్యోగిత మ‌రింత పెరిగే ప్ర‌మాదం భార‌త్‌కు పొంచి ఉంద‌నే చెప్పాలి. అనేక మంది అప్పులు చేసి గల్ఫ్ దేశాల‌కు చేరుకున్నారు. కానీ విధి వెక్కిరించి వారిని ఇప్పుడు మ‌రింత క‌ష్టాల్లోకి  నెట్టింద‌నే చెప్పాలి. ఇప్పుడు చేసిన అప్పులు తీర్చే మార్గం క‌నిపించ‌డం లేదు. ఉన్న‌ప‌లంగా బ‌తుకుపై క‌రోనా గుదిబండ‌మోపింది. ప్ర‌భుత్వం ఏవిధంగా సాయ‌ప‌డుతాయోన‌న్న దానిపైనే వారి బ‌తుకు ఆధార‌ప‌డి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: