విమానయాన రంగం ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. మామూలు రోజుల్లోనే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీకి  ఇప్పుడు ఉనికే ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో.. ఏయే సంస్థలు తట్టుకుని నిలబడతాయో అంతుచిక్కని పరిస్ధితి నెలకొంది. 

 

కరోనా లాక్ డౌన్ ప్రభావం ఏవియేషన్ సెక్టార్‌పై తీవ్రంగా పడింది. సాధారణ రోజుల్లోనే నష్టాలను చవిచూసే.. విమానయాన రంగాన్ని లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ గోరు చుట్టుపై రోకలి పోటులా చిదిమేస్తోంది. 21 రోజుల లాక్ డౌన్‌తో ఏవియేషన్‌ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళ్లింది. ఇప్పుడు మే 3 వరకు ఆంక్షలు కొనసాగుతాయని కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ రంగం భవిష్యత్‌పై నీలి నీడలు అలుముకున్నాయి.  

 

ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలు అంతర్జాతీయ సర్వీసులు పూర్తిగా నిలిపివేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులే ...ఇండియాలో కూడా ఉన్నాయి. ఇంటర్ నేషనల్, డొమెస్టిక్ ఫ్లైట్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. మొదటి దశ లాక్‌డౌన్‌ తర్వాత డొమెస్టిక్‌ సర్వీసులైనా నడిపే అవకాశం ఉందని భావించినా.. కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను పొడిగించింది కేంద్రం. విమానాలు పూర్తిగా ఎయిర్‌పోర్ట్‌లకే పరిమితమయ్యాయి. 

 

మే 3వరకు విమానాలు నడిపే పరిస్థితులు లేవు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్న గ్యారంటీ లేదు. ముందు ముందు విమానాలకు అనుతిచ్చినా.. ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విమానయాన రంగం 55 శాతం రెవెన్యూను కోల్పోయిందని అంచనా వేస్తున్నారు. మే 3 తర్వాత కూడా పరిస్థితి మరికొన్ని ఇలాగే ఉంటే ఈ రంగంపై కోలుకోలేని దెబ్బ పడనుంది. 

 

సర్వీసులు నడిపే అవకాశం లేకపోవడంతో.. ఇప్పటికే ప్రయాణీకులు బుక్ చేసుకున్న టికెట్లను రీషెడ్యూల్ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి. అదనపు రుసుములేమీ లేకుండా ప్రయాణికులు మరో తేదికి టిక్కెట్లను రీషెడ్యులు చేసుకునే వెసులుబాటు కల్పించాయి. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రయాణీకులు ఫ్రీగా రీషెడ్యూలు చేసుకునే అవకాశం ఉంటుందని విస్తారా ఎయిర్ లైన్స్ ప్రకటించింది. రీ బుకింగ్ సమయంలో ఛార్జీలు పెరిగితే.. ఆ వ్యత్యాసాన్ని ప్రయాణీకులు చెల్లించాల్సి ఉంటుంది.

 

రూపాయి ఆదాయం లేకపోవడంతో ఎయిర్ లైన్స్ క్యాష్ రిజర్వ్స్ రోజు రోజుకి పడిపోతున్నాయి. నిర్వహణ ఖర్చులు.. వడ్డీలు.. సిబ్బంది జీతాలు సహా అనేక ఖర్చులు మోయలేని భారంగా మారాయి. ఇలాంటి తరుణంలో దేశీయ విమాన సంస్థలు నిలుదోక్కుకుంటాయా అన్న చర్చ మొదలైంది. ఈ రంగంలో ఉద్యోగులపై తీవ్ర ప్రభావం ఉంటుందని లెక్కలేస్తున్నాయి సంస్ధలు.

 

విమాన సర్వీసులు ప్రారంభమైనా.. దేశీయ, అంతర్జాతీయంగా ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పటికే పలు దేశాల్లో విమానయాన సంస్థలను ఆదుకునేందుకు అక్కడి ప్రభుత్వాలు చర్యలు మొదలుపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎయిర్ లైన్స్‌ను ఆదుకునేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: