మహమ్మారి కరోనా ఎవరిని వదలడం లేదు. మొదట్లో పెద్దవాళ్లలో మాత్రమే కనిపించిన వైరస్‌.. ఆ తర్వాత చిన్నారులను కూడా ఇబ్బంది పెడుతుంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో దాదాపు 20 మంది చిన్నారులు కరోనా పాజిటివ్‌తో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు.

 

మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత వారితో కాంటాక్ట్ అయిన వారికీ వైరస్ సోకింది. ఇప్పుడు ఎటువంటి ట్రావెల్‌ హిస్టరీ లేకపోయినా.. కాంటాక్ట్ లేకపోయినా వైరస్ సోకుతోంది. దీంతో తెలంగాణలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో బాధితుల సంఖ్య 7 వందలకు చేరువలో ఉంది. వీరిలో ముక్కు పచ్చలారని చిన్నారులు కూడా ఉండటం బాధాకరం. ఇలాంటి పిల్లలకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 

 

తెలంగాణలో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని కరోనా ఆస్పత్రిగా మార్చింది. మొదట్లో ఒక ఫ్లోర్‌లోనే వార్డు ఏర్పాటు చేసినప్పటికీ.. కేసుల సంఖ్య పెరగడంతో.. ఓపీ సేవలు నిలిపివేసి మొత్తం ఆస్పత్రిని కరోనా వైద్యం కోసం వినియోగిస్తోంది. ఆస్పత్రిలోని 9 ఫ్లోర్లూ కరోనా బాధితులతో నిండిపోయింది. అయితే ఆరో ఫ్లోర్‌లో ప్రత్యేకంగా చిన్నారులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు.

 

ప్రస్తుతం గాంధీ  ఆస్పత్రిలో దాదాపు 4వందల మందికి పైగా కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. అందులో 20 మంది చిన్నారులు వైరస్‌ సోకిన వారు ఉన్నారు. నెల రోజుల పసికందు నుంచి 12 ఏళ్ళ వయసున్న వారిని ఈ వార్డుకు తరలించారు. కేంద్ర వైద్య మండలి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు వైరస్ సోకిన పిల్లలు కోలుకుంటున్నట్టు వైద్యులు చెప్తున్నారు. 

 

మరోపక్క రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న క్రమంలో పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: