కరోనా.. ఈ వ్యాధితో ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా బాధపడుతున్న దేశం ఏదైనా ఉంటే అది అమెరికానే. కరోనా కారణంగా చాలా దారుణంగా దెబ్బతిన్న దేశం అమెరికా. అత్యధిక కేసులు, అత్యధిక ప్రాణ నష్టం, ఆస్తి నష్టం.. ఇలా ఏ పరామితిలో చూసినా అమెరికాయే కరోనా కారణంగా అత్యధిక బాధితురాలు. ఇప్పటి వరకూ అందుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపు అమెరికాలో ఆరున్నర లక్షల కేసులు నమోదయ్యాయి.

 

 

కరోనా కారణంగా దాదాపు 30 వేల మంది కన్నుమూసినట్టు తెలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ సంచలన ప్రకటన చేశారు. అదేటంటే.. అమెరికా కరోనాను జయించేసిందని ప్రకటించారు. తన సర్కారు తీసుకున్న గ‌ట్టి చ‌ర్యల కారణంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని ట్రంప్ ప్రక‌టించ‌ుకున్నారు. అదేంటి ఆరున్నర లక్షల కేసులు ఉంటే.. కరోనాను జయించేశానని ట్రంప్ చెప్పడం ఏంటనుకుంటున్నారా..?

 

 

మరి ట్రంపా మజాకా.. ఆయన లాజిక్ ఏంటంటే.. కరోనా ఇప్పుడు అమెరికాలో పీక్ స్టేజ్‌ను తాకేసిందట. ఇప్పుడు ఇక తగ్గుముఖం పడుతుందట. ఇందుకు రెండు రోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్యను ఆయన ఉదాహరణగా చూపుతున్నారు. సో.. కరోనా ఇక అమెరికాలో తగ్గడమే తప్ప పెరగడం ఉండదని.. అందుకే తాము కరోనాను జయించేశామని ట్రంప్ చెబుతున్నారు.

 

 

ఇలా కరోనాను జయించేశామని ట్రంప్ ప్రకటించడంపై అమెరికాలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. క‌రోనా మ‌ర‌ణాల లెక్కల‌పై అక్కడి మీడియా, అధ్యయ‌నం చేస్తున్న వ‌ర్సిటీలు చెబుతున్న లెక్కలు వేరేగా ఉంటున్నాయి. అయితే వాటిని ట్రంప్ ప్రభుత్వం ఒప్పుకోవ‌డం లేదు. ఏ కార‌ణంతో మ‌ర‌ణించినా క‌రోనా ఖాతాలోకి క‌లుపుతున్నారంటూ ఆ రిపోర్టుల‌ను ట్రంప్ సర్కారు చెబుతోంది. మరి ఇంతకీ అమెరికా కరోనాను జయించేసినట్టేనా..? ఏంటో అంతా ఈ ట్రంప్ మాయ..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: