కరోనా మహమ్మారి వ్యాప్తి అడ్డుకట్ట వేసేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన విషయం తెల్సిందే. ఇప్పటికే మోదీ ప్రభుత్వం 21 రోజులు లాక్ డౌన్ పాటించాలని కోరితే, ఆ నిర్ణయాన్ని అటు ప్రజలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాయి. అయితే లాక్ డౌన్ ఉన్నా, కరోనా కేసులు మరింతగా పెరిగిపోయాయి. దీంతో మరో 19 రోజులు అంటే మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించారు. అయితే ఇలా లాక్ డౌన్ పొడిగించడం వల్ల కరోనా కేసులు తగ్గుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. రోజురోజుకూ ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇక మే 3 వరకు లాక్ డౌన్ ఉన్నా సరే కరోనా కేసులు తగ్గుతాయనే గ్యారెంటీ లేదు.

 

కాకపోతే లాక్ డౌన్ ఉండటం వల్ల కరోనా మరింతగా పెరగకుండా మాత్రం ఉంటుంది. ఇదే సమయంలో లాక్ డౌన్ కొనసాగుతూనే, కరోనా కేసులు తగ్గాలంటే కొన్ని చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చారు.  కరోనాను ఎదుర్కోడానికి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, రాండమ్ పరీక్షలు, వ్యూహాత్మకంగా పరీక్షలను నిర్వహించడమే ఏకైక పరిష్కారమని, అలాగే దేశంలో హాట్ స్పాట్, నాన్ హాట్ స్పాట్ అని రెండు జోన్లుగా విభజించాలని చెప్పారు.

 

అయితే రాహుల్ గాంధీ సలహా చాలావరకు ఉపయోగపడేదే అని చెప్పొచ్చు. కరోనా తగ్గాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం కాదు. రాండమ్ టెస్టులు చేయాలి. అలాగే రోజుకూ కరోనా టెస్టుల సంఖ్యని పెంచుకోవాలి. ఇక ఇదే ఫార్ములాని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందు నుంచే ఫాలో అవుతున్నారు.  ఏపీలో కరోనాని కట్టడి చేసేందుకు, లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తూనే, రాష్ట్రమంతా వాలంటీర్ల, ఆశా వర్కర్స్ ద్వారా ఆరోగ్య సర్వే చేయిస్తున్నారు. ఇంకా కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రస్తుతం మండల స్థాయి నుంచి రాండమ్ టెస్టులు చేయాలని ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

 

అలాగే ప్రస్తుతం ఏపీలో కరోనా టెస్టింగ్ కెపాసిటీ కూడా పెరిగింది. విశాఖ మెడ్ టెక్ జోన్ ద్వారా టెస్టింగ్ కిట్స్ తయారీని పెంచారు. ఫలితంగా ప్రస్తుతం రోజుకూ ఏపీలో 2100 వరకు టెస్టు చేయగలుగుతున్నారు. త్వరలో టెస్టింగ్ కెపాసిటీ 4 వేల వరకు పెరగనుంది. మొత్తానికైతే రాహుల్ గాంధీ ఇప్పుడు చెప్పిన సలహాలు జగన్ ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: