ఏపీలో మాజీ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారంపై ఎంత రచ్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఆయన కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేయడం, దానిపై జగన్ సీరియస్ అవ్వడం, చంద్రబాబు సామాజికవర్గం కాబట్టి రమేష్ టీడీపీలో లైన్ లో వెళుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేయడం జరిగింది.

 

అయితే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రమేష్ కుమార్ వ్యవహారం పక్కకు వెళ్లింది. కానీ జగన్ ప్రభుత్వం సైలెంట్ గా ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఆయన్ని పక్కకు తప్పించి, కొత్త కమిషనర్ ని తీసుకొచ్చింది. ఇక దీనిపై రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే  ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో రమేష్ కుమార్, కేంద్ర హోమ్ శాఖకు సెక్యూరిటీ కావాలని లేఖ రాసారు.

 

ఇక ఆ లేఖ ఫోర్జరీ జరిగిందని, చంద్రబాబు డైరక్షన్ లోనే లేఖ వెళ్లిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దాని గుట్టు ఏంటో తేల్చాలని కోరారు. అయితే ఆ వెంటనే రమేష్ కుమార్ స్పందిస్తూ, ఆ లేఖ తానే రాసానని క్లారిటీ ఇచ్చారు.  ఇక ఇక్కడే చంద్రబాబుని కాపాడటానికి రమేష్ రంగంలోకి దిగారని, టీడీపీకి, నిమ్మగడ్డకు లింక్ ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. వారి ఆరోపణలకు టీడీపీ నేతలు కూడా స్ట్రాంగ్ లాజిక్ లే చెబుతున్నారు. అసలు కరోనా వ్యాప్తి రాకుండా ఎన్నికలు వాయిదా వేసి రమేష్ కుమార్ మంచి పని చేసారని, అప్పుడు జగన్ తో సహా వైసీపీ నేతలు ఎన్నికలు ఎన్నికలు అంటూ తహతహలాడారని, ఏ మాత్రం ఆలోచన లేకుండా రమేష్ విమర్శలు చేసారని,  ఆ విషయం ప్రజలు కూడా గమనించారని అంటున్నారు.

 

అలాగే తనకు సెక్యూరిటీ కావాలని అధికారికంగా తన మెయిల్ నుంచే రమేష్ కుమార్ కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాసారని, ఆ విషయంపై కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చి, సెక్యూరిటీ పెంచిందని, అలాంటప్పుడు రమేష్ కుమార్ బయటకొచ్చి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముందని తెలుగు తమ్ముళ్లు గట్టిగా చెబుతున్నారు. ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డి హడావిడి చేస్తున్నారు, పైగా పదవిలో కూడా లేరు కాబట్టి, రమేష్ బయటకొచ్చి వివరణ ఇచ్చారని అంటున్నారు. అసలు వైసీపీ ప్రభుత్వం తప్పులు చేస్తూ, వాటిని ఆపడానికి ప్రయత్నిస్తున్న వారికి చంద్రబాబుతో లింక్ పెట్టి, జగన్ అండ్ కొ రాద్ధాంతం చేస్తుందని, ఇకనైనా అలాంటివి మానుకోవాలని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: