ఒక వైపు కరోనా విషయంలో సిబ్బంది అందరు బాగా కష్టపడుతున్నారు అని మెచ్చుకుంటుంటే.. మరో వైపు ఈ సమాజంలో మానవత్వం ఉందా అని ప్రశ్నించుకోవలసిన స్దితి ఏర్పడుతుంది.. మంచి పేరు రావడానికి ఎంతో శ్రమ పడాలి కానీ చెడ్దపేరు తెచ్చుకోవడానికి ఒక చిన్న సంఘటన చాలు.. వివరంగా చెప్పాలంటే తెల్లటి పేపర్ మీద ఒక చిన్న నల్లమచ్చ ఉంటే అందరు ఆ నల్ల మచ్చనే చూస్తారు గానీ.. ఆ పేపర్ తెలుపును పట్టించుకోరు.. ఇదిగో ఇప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది.. ఒక నిండు గర్భిణీ పడ్ద అవస్దలు, పురిటి నొప్పుల యాతన నిజంగా ఆడపిల్లగా పుట్టడమే శాపమా అనేలా చేసింది..

 

 

పాపం ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అందుబాటులో ఎలాంటి వాహనం లేకపోవడంతో నడిరోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది.. అత్యంత బాధాకరమైన ఈ ఘటనకు సంబంధించిన ఆ వివరాలు తెలుసుకుంటే.. అర్వపల్లి మండలం రామన్నగూడెనికి చెందిన దండకొండ వెంకన్న, రేష్మ దంపతులు సూర్యాపేటలోని అన్నాదురైనగర్‌లో అద్దె ఇంటిలో ఉంటున్నారు. కాగా రేష్మకు రాత్రి ఒంటిగంట సమయంలో పురిటినొప్పులు మొదలవగా, ఆమె భర్త 108కు ఫోన్‌ చేయగా, ఆ సిబ్బంది నిర్లక్ష్యంగా వాహనం అందుబాటులో లేదని, పెన్‌పహాడ్‌ నుంచి రావల్సి ఉందని సమాధానం ఇచ్చారట.  

 

 

ఏం చేయాలో తోచని ఆమె భర్త తన బైక్‌పైనే భార్యను కూర్చో పెట్టుకుని సూర్యాపేట గల్లీలో అడ్డుగా ఉన్న బారికేడ్‌లు తొలగించుకొని కోర్టు చౌరస్తా వరకు వచ్చాడు. కానీ రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ఆ ప్రాంతంలో ఉన్న ఇనుప కంచె తీయడానికి వీలు లేకపోవడంతో సహయం కోసం తెలిసిన వారికి ఫోన్ చేసి రప్పించుకున్న తర్వాత ఆ మహిళ భర్త వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ వాహనాలు ఉన్నా డ్రైవర్‌ లేడని విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ చెప్పటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో భార్యను దింపిన చోటుకు చేరుకున్నాడు. కానీ అప్పటికే ఆ రోడ్డుపైనే ఆమె ప్రసవించగా స్థానికులు సహాయం చేశారు..

 

 

పాపం ఆ భర్త పిచ్చివానిలా వెంటనే సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి వెళ్లి తన భార్య రోడ్డుపై ప్రసవించిందని, దయచేసి చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది రావాలని ప్రాధేయపడ్డాడు.. కానీ మానవత్వం మరచిన వారు తమ నిబంధనలు ఒప్పుకోవని ఆమెను ఆస్పత్రికే తీసుకురావాలని తేల్చి చెప్పారట. ఇక చాలా లేటుగా వచ్చిన అంబులెన్స్‌లో బాలింతను హాస్పటల్‌కు తరలించగా అక్కడ డాక్టర్లు చికిత్స చేసి తల్లీబిడ్డ  క్షేమంగా ఉన్నారని తెలిపారు... ఆ భగవంతుడి దయవల్ల ప్రసవం సుఖంగా జరిగింది కానీ అనుకోని ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు అని స్దానికులు ప్రశ్నిస్తున్నారు.. కొందరు మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల సిన్సియారిటిగా ఉద్యోగాలు చేసే వారికి కూడా చెడ్దపేరు వస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: