అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా శిఖర స్థాయిని దాటేసిందని, త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ట్రంప్ చెబుతున్నారు. 

 

అగ్రరాజ్యం అమెరికాపై కరోనా వైరస్‌ పగబట్టింది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 2, 569 మంది మృత్యువాత పడ్డారు. జాన్స్‌హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయ గణంకాల ప్రకారం.. వైరస్‌ వ్యాప్తి చెందుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రోజు ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి. అమెరికాలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 29 వేలకు చేరువైంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే కరోనా కారణంగా ఎక్కువ మరణాలు సంభవించాయి.  

 

అమెరికాలో 10 వేలకు పైగా మరణాలు ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఈ గణాంకాలు సరైనవి కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే ఇప్పటివరకు 10 వేల మందికిపైగా ప్రాణాలను కొవిడ్‌ బలి తీసుకుందని అంచనా. అధికారిక లెక్కల ప్రకారం న్యూయార్క్ లో 6,589 మంది మరణించారు. అయితే కొవిడ్‌-19 లేదా దాని సమానమైన అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు న్యూయార్క్‌ నగరంలో మరో 3,778 మరణ ధ్రువీకరణ పత్రాల్లో పేర్కొని ఉంది. ఈ మృతులను తాము కరోనా సంబంధిత లెక్కల్లో పరిగణనలోకి తీసుకోలేదని నగర ఆరోగ్య కమిషనర్‌ వెల్లడించారు. ఆ సంఖ్యను కూడా కలిపి చూస్తే నగరంలో మరణాల సంఖ్య 10 వేలు దాటుతుందని తెలిపారు. 

 

కరోనా వైరస్ కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్యలో శిఖర స్థాయిని దాటుకుని తమ దేశం కుదుటపడుతోందని, ఈ నెలలోనే కొన్ని రాష్ట్రాలు తెరుచుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. గవర్నర్లతో సంప్రదింపుల తర్వాత కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడంపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తానని ట్రంప్ చెప్పారు. అందరం కలిసి దేశాన్ని యథాతథస్థితికి తెచ్చుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఇప్పటివరకూ కరోనా సోకిన వారి సంఖ్య కూడా  7 లక్షలకు చేరువైంది. మృతుల సంఖ్య 29 వేలకు చేరువైంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం.

 

అమెరికాలో 33 లక్షల మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించామని, యాంటీబాడీ పరీక్షలు కూడా త్వరలోనే మొదలవుతాయని ట్రంప్ చెప్పారు. ఈ పరిణామాలతో లాక్ డౌన్ ఎత్తేసే విషయంలో మెరుగైన స్థితికి చేరుకున్నామని చెప్పారు ప్రెసిడెంట్. మే 1న లాక్‌డౌన్ ఎత్తివేయొచ్చని ట్రంప్ సర్కారు ఇప్పటికే సంకేతాలిచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో సాధారణ కార్యకలాపాలు అంతకన్నా ముందుగానే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ కొనసాగించినా మరణాలు ఉంటాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన కొద్దీ మానసిక సమస్యలు వస్తున్నాయని, సూసైడ్ హెల్ప్ లైన్లకు కాల్స్ పోటెత్తుతున్నాయని చెప్పారు . ఇప్పటికే అమెరికా లాక్ డౌన్ కారణంగా లక్షల సంఖ్యలో అమెరికన్ల ఉద్యోగాలు పోయాయి. నిరుద్యోగ రేటు రికార్డు స్థాయికి చేరుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: