దేశంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,387గా ఉండగా, 437 మంది మరణించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ సొంత రాష్ట్రమైన గుజ‌రాత్‌లో వ్యాధుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అదే స‌మ‌యంలో ఆయ‌న న‌మ్మిన‌ బంటు అనే పేరున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ రాష్ట్రం మాత్రం ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకొంటోంది. కరోనాని ఎదుర్కోవడంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరించిన విధానం ప్రశంసలను అందుకుంటోంది. అదే స‌మ‌యంలో గుజరాత్‌లో కొత్తగా 92 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావిత కేసుల సంఖ్య వెయ్యి దాటింది.

 

ప్రమాద‌కరమైన క‌రోనా వైరస్‌ ప్రభావంతో గుజ‌రాత్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు 38 మంది మరణించారు. శుక్రవారం ఉదయం వరకు 929గా ఉండగా, కొత్తగా నమోదైన కేసులతో మధ్యాహ్నం నాటికి 1021కి చేరింది. మ‌రోవైపు ఈ రాష్ట్రంలోని ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, బాధితులకు చికిత్స, పేద ప్రజల ఆర్థిక కష్టాలను తీర్చడంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ సమర్థంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా యూపీ సర్కారును అభినందించారు. మిగతా రాష్ర్టాలు కూడా ‘యూపీ మోడల్‌'ను అనుసరించాలని సూచించారు. 

 

కరోనా హాట్‌స్పాట్‌లను గుర్తించే విధానాన్ని దేశంలో మొదటిసారి యూపీనే అవలంబించింది. ఆరు కంటే ఎక్కువ కేసులున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి, ఆ ప్రాంతాలకు రాకపోకలను పూర్తిగా నిషేధించింది. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఇంటికే చేర్చింది. కరోనా ఆంక్షలతో తీవ్రంగా ప్రభావితమైన వారికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇచ్చింది. 12.25 లక్షల భవన నిర్మాణ కార్మికులతోపాటు వీధి వ్యాపారులకు, రిక్షా కార్మికులకు, కాంట్రాక్ట్‌ కార్మికులకు, ఉపాధి కార్మికులకు రూ.1000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ విధానంపై పలు రాష్ట్రాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: