దేశంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఓ వైపు పెరుగుతున్న పాజిటివ్ కేసులు మ‌రోవైపు ప‌లు రాష్ట్రాల్లో సంభ‌విస్తున్న మ‌ర‌ణాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో లాక్ డౌన్ విష‌యంలో ప‌లు వ‌ర్గాలు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. గత నెల 24 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్‌తో జనం పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా కేంద్రం ఈ నెల 20 నుంచి కొన్ని సడలింపులు ఉండేలా గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇందులో రోజువారీ కూలీలు, కార్మికులకు పని దొరికేలా... అత్యవసర విభాగాలు, ఉత్పత్తి రంగాలు మళ్లీ పట్టాలెక్కేలా వెసులుబాటు కల్పించింది. అయితే, దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి త‌గిన‌ట్లుగా ఆయ‌న వ్యూహాలు ర‌చించిన‌ట్లు తెలుస్తోంది.

 

ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్‌ పొడిగిస్తున్నట్లు ఏప్రిల్ 11వ తేదీనే తెలంగాణ‌ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఈ నెల 14న  ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ.. లాక్ డౌన్  పొడిగిస్తూనే కూలీలు, కార్మికులు, ఉత్పత్తి రంగానికి ఊరటనిస్తూ సడలింపులు ఇచ్చారు. దీనిపై బుధవారం గైడ్ లైన్స్‌ విడుదలయ్యాయి. ఈ విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క్రమంలో ఈ నెల 19న కేబినెట్ భేటీ జరుగనుంది. కేంద్రం ఇచ్చిన సడలింపులను ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో అమలు చేయాలా..? లేక ఇవేవీ లేకుండా  మే 3 వరకు లాక్డౌన్ను ఇప్పటిలాగానే కొనసాగించాలా..? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ కేబినెట్ స‌మావేశం అనంత‌రం కేంద్రానికి త‌మ వైఖ‌రిని స్ప‌ష్టంగా తెలియ‌జేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

 


రాష్ట్రాలకు హెలిక్యాప్టర్ మనీ పంపిణీ చేయాలని, రాష్ట్రాలకున్న అప్పుల కిస్తీల చెల్లింపులను ఆరు నెలలు వాయిదా వేయాలని, మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్ఆర్బీఎం పరిమితిని 5 శాతానికి పెంచాలని ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రికి రాసిన‌ లేఖలో సీఎం కేసీఆర్ కోరారు. వీటిపై  కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌లో సడలింపులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో  నిధుల కోసం రాష్ట్రాలు ఒత్తిడి పెంచకుండా కేంద్రం కట్టడి చేసిందని అభిప్రాయపడుతున్నారు. వీటిని వ్య‌క్తీక‌రిస్తూ కేబినెట్ స‌మావేశం రూపంలో లేఖ రాయ‌నున్నార‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: