మాయ‌దారి క‌రోనా రోగాన్ని ప్ర‌పంచానికి అంటించిన చైనాకు షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా ఊహించ‌ని షాకులు త‌గిలాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన‌ వుహాన్ నగరంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఒక‌టి కాదు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో... చైనాలో వ్యాపారాన్ని పూర్తిగా మూసివేసింది. ఏడేళ్ల‌ క్రితం చైనా ప్రభుత్వరంగ సంస్థ డాంగ్‌ఫెంగ్‌తో కలిసి అక్కడ వ్యాపారాన్ని ఆరంభించిన సంస్థ తాజాగా దుకాణం మూసివేసింది.

 

ప్రపంచ ఆటోమొబైల్‌ రంగానికి దిక్సూచిగా ఉన్న చైనా ప్రస్తుతం ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వాహన విక్రయాలు 45.4 శాతం పడిపోయాయి. ఇదే స‌మ‌యంలో రెనాల్ట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అమ్మకాలు పడిపోయి ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ కుదురుకునే స‌మ‌యం ప‌ట్టే ప్ర‌మాదం ఉన్న నేప‌థ్యంలో పెట్టేబేడా స‌ర్దేసుకుంది. కాగా, ఇదే వరుసలో అనేక కంపెనీలు త్వరలో చైనాకు గుడ్​ బై చెప్పేయడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

మ‌రోవైపు చైనాలో క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. కొన్ని వారాలుగా చైనాలో 3,300గా ఉన్న మరణాల సంఖ్య ఇప్పుడు ఒక్కసారిగా 4,600కి చేరుకుంది. అందుకు కారణం ఈ వైరస్‌కి కేంద్ర బిందువైన వుహాన్‌లో మరణాల సంఖ్య ఏకంగా 50 శాతం పెరిగాయి. అక్కడ మొత్తంగా 1,290 మంది కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని తాజాగా వెల్లడైంది. దీనిపైన అక్కడి స్థానిక ప్రభుత్వం స్పందించింది. నగరంలో కరోనా వ్యాప్తి ప్రారంభ రోజుల్లో తప్పుగా లెక్కించడం జరిగిందని అంగీకరించింది. ప్రైవేట్‌, తాత్కాలిక ఆస్పత్రుల నుంచి సమాచారాన్ని సేకరించడంలోనూ జాప్యం జరిగిందని, వ్యాప్తి ప్రారంభ దశలో ఆసుపత్రులు తట్టుకోలేక పోవడంతో కొంతమంది రోగులు ఇంట్లో మరణించారని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: