ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో కూడా కరోనా వేగంగా విజృంభిస్తోంది. నిన్నటివరకూ రాష్ట్రంలో 572 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా పంజా విసురుతుండడంతో రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. తాజాగా కరోనాపై అవగాహన కల్పిస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాట రూపకల్పన జరిగింది. 
 
డీజీపీ గౌతమ్ సవాంగ్ ‘ఛలే జా కరోనా’ పేరుతో రూపొందించిన ఈ పాటను నిన్న విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న పోషిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, కరోనా వారియర్స్ తో పాటు ఇంట్లో ఉండి కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న వారందరికీ ఏపీ పోలీస్ సెల్యూట్ చేస్తున్నట్లు ఈ పాటను రూపొందించారు. స్పార్జన్ ఈ పాటకు లిరిక్స్, మ్యూజిక్ అందించడంతో పాటు డైరెక్టర్ గా వ్యవహరించారు. 
 
ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర ఈ పాటను ఆలపించారు. నిన్న విడుదలైన ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లు ఛలే జా కరోనా పాట అదిరిపోయిందంటూ కామెంట్ల రూపంలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పాటను ఆలపించిన సింగర్ శ్రీరామచంద్రను గౌతమ్ సవాంగ్ అభినందించారు. "భరతమాత భక్తి చాటె ముద్దుబిడ్డగా.... మీరునేను ఏకమై కదం తొక్కగా" పల్లవితో మొదలయ్యే పాట అద్భుతంగా ఉందంటూ సామాన్యులు సైతం ప్రశంసిస్తున్నారు. 
 
ప్రపంచాన్నే కరోనా వణికిస్తున్న నేపథ్యంలో భరతమాత భక్తి చాటే ముద్దుబిడ్డలుగా మనమంతా ఏకమై కరోనాను తరిమి కొడదామనే సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఈ పాటను రూపొందించింది. ఈ పాటలో కరోనాను కట్టడి చేయడానికి మన ప్రభుత్వాలు చేస్తున్న కృషిని, నిబంధనలను వివరిస్తూ మన అందరి ఐకమత్యాన్ని జోడించడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: