దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ భారత నావికా దళంలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రమాద గంటలు మోగిస్తోంది. జలాంతర్గాముల్లో, భారత యుద్ధ నౌకలలో పని చేసే 20 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. వైరస్ సోకిన వారిని ముంబైలోని ఇండియన్ నేవీకు చెందిన అశ్వినీ ఆస్పత్రిలో చేర్పించారని సమాచారం. వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. 
 
భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ 20 మందికి కరోనా సోకడం గురించి స్పందిస్తూ 20 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో యుద్ధ నౌకల్లో, జలాంతర్గాముల్లో వైరస్ లేకుండా శానిటైజ్ చేయించామని తెలిపారు. నేవీ అధికారులు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో అవసరమైన శిక్షణ, సమావేశాలు, ప్రయాణాలను రద్దు చేసినట్లు తెలిపారు. నేవీ అధికారులు ఎక్కువమంది గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
 
సిబ్బంది ఉన్న చోటు నుంచే పని చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. నావికాదళం సిబ్బందికి కరోనా సోకడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా 8 మందికి కరోనా సోకిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నారావణే తెలిపారు. ప్రత్యేక రైళ్ల ద్వారా కరోనా నెగిటివ్ వచ్చిన సిబ్బందిని బెంగళూరు నుంచి జమ్మూ, గౌహతిలకు పంపించినట్లు తెలిపారు. 
 
మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో నిన్నటివరకు 13,835 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 1767 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 452 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఏపీలో నిన్నటివరకు 572 కరోనా కేసులు నమోదు కాగా తెలంగాణలో 766 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: