నేటికాలంలో మనిషి జీవితం యంత్రం కంటే ఘోరంగా తయారయ్యింది.. కనీసం తనకు తానుగా, తన గురించి ఆలోచించుకునే అంతటి సమయం కూడా చిక్కకుండా, ఒక మర మనిషిలా మారాడు.. ఇలాంటి సమయంలో ఆధ్యాత్మికత గురించి ఆలోచించడమే మానేసాడు.. ఎప్పుడైతే తన జీవితాన్ని లోకసంబంధమైన విషయాల వైపు మళ్లించాడో అప్పుడే అతని జీవితంలో అశాంతి అనే రాక్షసుడు తిష్ట వేసుకుని కూర్చున్నాడు.. ఇదెలా ఉందంటే ఒక రాజ్యాన్ని పాలించే రాజు శక్తివంతునిగా ఉన్నంత కాలం అతని రాజ్యం వైపు శత్రువులు చూడటానికి భయపడతారు. ఎప్పుడైతే ఆ రాజు శారీరకంగా, మానసికంగా బలహీనపడతాడో అప్పుడే ఎక్కడో దాక్కున్న గుంటనక్కలన్ని దాడి చేయడానికి పూనుకుంటాయి...

 

 

నేటి కాలంలో మనిషి జీవితం ఇలాగే మారింది.. ఒక్క క్షణం ప్రశాంతంగా కూర్చుని, తన మనస్సును నిచ్చలమైన స్డితిలోకి తెచ్చుకుని, తనలో కలిగే ఆలోచనల కెరటాలను అదుపు చేసుకుని అంతులేని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని ప్రయత్నించడం లేదు. ఎప్పుడు తుచ్చమైన శరీర సుఖాల కోసమే ప్రయత్నిస్తున్నాడే గాని, ఆత్మ సంబంధమైన సాధన కోసం పరితపించడం లేదు. ఇలాంటి పరిస్దితుల్లో, తన శరీరాన్ని, మనసుని అదుపులో పెట్టుకోలేక మానవుడు నిత్యం ఎన్ని సుఖాలున్న, వేదన అనుభవిస్తున్నాడు. కన్నీటితో కాలాన్ని వెళ్లదీస్తున్నాడు.. ఆధ్యాత్మికత అనే గంధపు వనాన్ని వీడి, గంజాయి వనంలో బ్రతుకుతున్నాడు..

 

 

అయితే ఒకప్పుడు అజ్ఞానంలో బ్రతుకుతున్న మనుషులను జ్ఞానం అనే వెలుగువైపు నడిపించడానికి ఆశ్రమాలు ఉండేవి, గురుభోధనలు ఉండేవి.. మారుతున్న మానవ జీవన గతుల్లో అవి క్రమ క్రమంగా కనుమరుగై, కేవలం పుస్తకాలు చదవడం ద్వారా తనలోని అజ్ఞానాన్ని తరిమి వేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆతర్వాత మనిషి జీవితం సమయం కంటే వేగంగా మారిపోయింది. ఇప్పుడున్న ఆధ్యాత్మిక సంపదా అంతా అటకెక్కి దుమ్ముపట్టి పోతున్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో మళ్లీ మనిషిని పూర్తిగా ఆక్రమించిన మాయ నుండి, బయట పడవేయడానికి ఆధ్యాత్మిక సాధనలకు ఉన్న విశిష్టతను ప్రపంచానికి తెలియచేయడానికి అప్పుడప్పుడు ఇలాంటి భయంకరమైన కరోనా లాంటి రాక్షసులు వస్తుంటారు..

 

 

వీరిని ఎదుర్కోవాలంటే మానవ శక్తి సరిపోదని ఇప్పుడు ప్రత్యక్షంగా నిరూపించబడుతుంది.. కాబట్టి సక్రమమైన జీవన విధానం.. పెద్దలంటే గౌరవం.. సమస్త జీవుల పట్ల దయ.. ఇవి మాత్రమే మనిషి మనిషిగా బ్రతకడానికి ఉపయోగపడేవి.. అంతే కాకుండా కరోనా ఒక్కటే ముగింపు కాదు.. ఈ విపత్తు ఆరంభం మాత్రమే.. ముందు ముందు ఎదుర్కొనబోయే ఇలాంటి ఎన్నో కఠిన పరీక్షలకు ఇప్పటి నుండే స్వార్ధంతో బ్రతుకుతున్న మనిషి సిద్దపడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: