దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. దీంతో ప్రజలంతా పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ అమల్లో ఉండటంతో ప్రజలు చాలా విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
ఏపీ విద్యుత్ శాఖ కొన్ని రోజుల క్రితం వినియోగదారులకు గత నెలలో ఎంత బిల్లు వచ్చిందో అంతే మొత్తం ఈ నెల చెల్లించాలని సూచించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యుత్ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అమల్లో ఉండటంతో గృహ, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు కరెంట్ బిల్ చెల్లించకపోయినా విద్యుత్ సరఫరా నిలిపివేయకూడదని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గృహ, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు బిల్లు ఆలస్యంగా చెల్లించినా సరఫరా నిలిపివేయరు. 
 
సాధారణంగా కరెంట్ బిల్లు జారీ అయిన 14 రోజుల్లోగా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు ఆలస్యంగా బిల్లు చెల్లిస్తే రీ కనెక్షన్ చార్జీలను వసూలు చేస్తారు. బిల్లు చెల్లింపులో మరీ ఆలస్యం చేస్తే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ నిబంధనలను సడలించిందని సమాచారం. 
 
అయితే అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఏపీలో నిన్నటివరకు 572 కేసులు నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ నిన్న సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంతో నిన్న ఉదయం నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 766కు చేరింది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: