కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ లో భాగంగా ప్రజలంతా స్టే హోమ్ స్టే సేఫ్ నినాదంతో ఇళ్లకే పరిమితమయ్యారు. వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు కరోనా కట్టడిలో కీలక భూమిక పోషిస్తున్నారు. కానీ ఇళ్ళకే పరిమితమైన ప్రజలకు రెప్పపాటు కరెంటు పోకుండా ఆవిశ్రాంతంగా కృషి చేస్తున్న కరెంటు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. 

 

దేశవ్యాప్తంగా 27 రోజులుగా లాక్‌డౌన్‌  కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యుత్‌ వినియోగం మరింత పెరిగింది. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు విద్యుత్‌ ఉద్యోగులు 24 గంటలూ శ్రమిస్తున్నారు. ప్రధాని ఇచ్చిన దీపం కార్యక్రమానికి ఒక్కసారిగా ప్రజలంతా లైట్లు ఆర్పివేస్తే గ్రిడ్ వ్యవస్థ దెబ్బతింటుందన్న ఆందోళన దేశవ్యాప్తంగా తలెత్తింది. కానీ అలాంటి సవాలును సైతం అధిగమించడంలో విద్యుత్ వ్యవస్థ విజయవంతమైంది. 

 

రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలో సుమారు 50 వేల మంది సిబ్బంది ఉన్నారు. వీరు ఆరు లక్షల కిలోమీటర్ల విద్యుత్ లైన్లు, 350 ఈహెచ్‌టి సబ్‌స్టేషన్లు, 33 కేవీ సామర్ధ్యం కలిగిన మూడు వేల సబ్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటిని సమన్వయం చేసుకుంటూ సుమారు 24 లక్షల వ్యవసాయ మోటారు పంపుసెట్లకు, కాళేశ్వరం ప్రాజెక్టు పంపులకు, గృహాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తున్నారు. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మూతపడటంతో భారీ స్థాయిలో డిస్కంలు నష్టాలను చవిచూస్తున్నాయి. 

 

మరోవైపు ఇళ్లకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిరంతరం జరగాలంటే ఫీల్డ్ లెవెల్ సిబ్బంది రోజులో 3 షిఫ్టులు పనిచేయక తప్పదు. విద్యుత్ పంపిణీలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణలోని డిస్కమ్‌లలో సుమారు 50 వేల మంది పని చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది ఫీల్డ్ మీదనే పనిచేస్తారు. డిప్యూటీ ఇంజనీర్ మొదలు ఏడీఈ, ఏఈ, లైన్ ఇన్స్ పెక్టర్, లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్, ఆర్టిజన్స్‌ ఇలా అన్ని స్థాయిల్లోని సిబ్బంది నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. 

 

అయితే కరోనా కారణంగా కొన్నిసార్లు గ్రామాల్లోకి తమని రానివ్వడం లేదని విద్యుత్ ఉద్యోగులు చెప్తున్నారు. కొన్నిసార్లు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటున్నామంటున్నారు. రోడ్లమీద తిరిగేటప్పుడు పోలీసులతోనూ ఇబ్బంది ఎదురవుతోందని ఉద్యోగులంటున్నారు. 

 

అసలే వేసవికాలం ఒక్క క్షణం కరెంటు పోతేనే ఇళ్ళల్లో జనం పడే బాధలు వర్ణణాతీతం. ఇలాంటి సమయంలో కరోనాను ఎదుర్కొంటూ విద్యుత్ ఉద్యోగులు కష్టపడుతున్నారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: