కరోనాకు మందు లేదు. చికిత్స లేదు. ఏ ఔషధానికి లొంగుతుందో తెలుసుకుని ఆ మందులు వాడేస్తున్నారు. ప్రస్తుతానికి  హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను చక్కటి డ్రగ్‌గా భావిస్తున్నారు. ఇదే సమయంలో పాజిటివ్‌ కేసుల పట్ల ఆశాకిరణంగా కనిపిస్తోంది ప్లాస్మా చికిత్స!

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌కు ప్రస్తుతం వ్యాక్సిన్‌ లేదు. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ ఈ మహమ్మారి లొంగబోదని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఎన్నాళ్లిలా  కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చెయ్యాలి? అందరినీ వేదిస్తున్న ప్రశ్న ఇది. ఇక లాభం లేదని  భావించిన కొందరు వైద్యులు పాత చికిత్సను బయటకు తీశారు. అదే ప్లాస్మా థెరపీ. ప్లాస్మా  ట్రాన్స్‌ఫ్యూజన్‌తో రోగులు కోలుకుంటున్న సంకేతాలు ఉండటంతో ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. USలో ముగ్గురు భారత అమెరికన్లు ఈ చికిత్సతో కోలుకుంటున్నట్లు హ్యూస్టన్‌లోని సెంట్‌లూక్స్‌ మెడికల్ సెంటర్‌ వైద్యులు ప్రకటించడంతో వైద్య నిపుణులు దీనిపై ఫోకస్‌ పెట్టారు.  భారత అమెరికన్లు రోహన్‌ బవడేకర్‌, డాక్టర్‌ లవంగ వెలుస్వామి, సుష్మ్‌ సింగ్‌ కరోనా వైరస్‌తో సెంట్‌లూక్స్‌ ఆస్పత్రిలో చేరినప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు గమనించారు. వెంటనే ప్లాస్మా చికిత్స ప్రారంభించారు. ఈ విధానంలో వారు కోలుకుంటున్నట్లు తెలుసుకున్నారు వైద్యులు. 

 

ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో  వ్యాక్సిన్‌ రావడానికి మరో ఏడాది పట్టే వీలుంది. అందుకే కరోనాతో ఆరోగ్యం విషమించిన వారికి ప్లాస్మా చికిత్స చేసేందుకు అమెరికా, చైనాలో చర్యలు మొదలు పెట్టారు. వాస్తవానికి గతంలో చాలా వైరస్‌లు, రోగాల చికిత్సకు ప్లాస్మా విధానాన్ని అనుసరించి సక్సెస్‌ సాధించారు. ఈ చికిత్సకు అమెరికాలో ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ FDA ఇంకా ఆమోదం తెలుపలేదు. కాకపోతే క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి FDA ఓకే చెప్పింది. ఆ తర్వాత హ్యూస్టన్‌ మెడికల్‌ సెంటర్‌తోపాటు అమెరికాలోని పలు ఆస్పత్రుల్లో చికిత్సలు ప్రారంభించారు.  చైనాలోనూ ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఐదుగురు కరోనా రోగులపై చేసిన ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. 

 

వెంటిలేటర్‌పై ఉండి.. విషమ స్థితి ఉన్నవారికి మాత్రమే ప్లాస్మా పద్ధతిలో ట్రీట్ మెంట్ చేస్తారు.  దీనివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ ఉండవు. కాకపోతే చికిత్సకు ముందు రోగి కుటుంబసభ్యుల అనుమతి  తప్పనిసరి. మన దేశంలో అయితే ICMR, సెంట్రల్‌ డ్రగ్‌ కంట్రోల్‌ కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది.  ప్లాస్మా చికిత్స కూడా వ్యాక్సిన్‌ లాంటిదే. టీకా వేసినప్పుడు రోగ నిరోధకశక్తి యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. తర్వాతి కాలంలో ఎప్పుడైనా వైరస్‌ సోకితే.. అతనిలో తక్షణమే యాంటీబాడీస్‌ విడుదలై దానిని నిర్వీరం  చేస్తాయి. వ్యాక్సిన్‌కు, ప్లాస్మా చికిత్సలో ఒక స్పష్టమైన తేడా మాత్రం ఉంది.  వ్యాక్సిన్‌ జీవితకాలం రోగ నిరోధక శక్తిని ఇస్తే.. ప్లాస్మాలో మాత్రం శరీరంలోకి చొప్పించిన యాంటీబాడీస్‌ రక్తంలో ఉన్నంత కాలం మాత్రమే కాపాడతాయి. అంటే ఈ చికిత్స తాత్కాలిక రక్షణగానే ఉపయోగపడుతుంది. కరోనా విషమించి ప్రాణాలు పోకుండా కాపాడుతుంది. 

 

వాస్తవానికి బ్యాక్టీరియాలతో ఫైట్‌ చేయడానికి మన దగ్గర  సమర్థమంతమైన యాంటీబాడీస్‌ ఉన్నాయి. వైరస్‌ల దగ్గరకు వచ్చే సరికి ఢీ అంటే ఢీ అనలేవు. పైగా కొత్త వైరస్‌లు ఏవైనా వస్తే వెంటనే మందులు సిద్ధం చేయలేం. గతంలో అంటువ్యాధులు ప్రబలినప్పుడు కన్వాలెసెంట్‌ ప్లాస్మాను ఉపయోగించారు. 2009లో H1N1 వచ్చినప్పుడు ICUలో చేరిన రోగులకు ప్లాస్మా ద్వారానే నయం చేశారు. అప్పుడు రోగుల పరిస్థితి మెరుగుపడి.. మరణాల రేటు తగ్గింది. తర్వాత వచ్చిన ఎబోలాకు సైతం ఇదే విధానాన్ని ఎంచుకున్నారు. 

 

పైగా  ప్లాస్మా చికిత్స సురక్షితమేనని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇటీవల రక్తపరీక్షల నుంచి మెరుగైన ఫలితాలు వస్తుండటంతో.. రక్తం ద్వారా సంక్రమించే వైరస్‌లను పక్కాగా తెలుసుకుంటున్నారు. రక్తం తీసుకునే ముందు దాత బ్లడ్‌ గ్రూప్‌, ఆర్‌హెచ్‌ పోలికతోపాటు హెపటైటిస్‌, hiv, మలేరియా వంటి పరీక్షలు చేస్తారు. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు సోకుతాయనే భయం అక్కర్లేదు. అలాగే రక్తమార్పిడి వల్ల ప్రతికూలతు వస్తాయనే టెన్షన్‌ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్మా చికిత్స ద్వార యాంటీబాడీస్‌ను ఎక్కించిన తర్వాత అవి మూడు నాలుగు రోజులపాటు ఉంటాయి. ఆ సమయంలోనే కరోనా నుంచి రోగి త్వరగా కొలుకుంటాడు. 

 

ఇతర దేశాల్లో ఈ థెరపీతో మంచి ఫలితాలు సాధిస్తున్నా.. కరోనా చికిత్సలో చివరి ప్రయత్నంగానే దీనిని ఎంచుకోవాలని అంటున్నారు. ప్లాస్మా చికిత్సకు చాలా పరిమితులు ఉండటంతో.. మనం దీనిపై పూర్తిగా ఆధారపడలేమనేది కొందరి అభిప్రాయం. ఎవరి వాదన ఎలా ఉన్నా...చికిత్సకు లొంగని కరోనాను కట్టడి చేసి ప్రాణాలు నిలబెట్టాలంటే ప్లాస్మా థెరపీ సంజీవనిగా భావిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: