గుంటూరు ఆటోనగర్‌ను కరోనా టెన్షన్ పెడుతోంది. కరోనా లక్షణాలు ఉన్న కొంత మంది... ఆ విషయం అధికారులకు తెలిస్తే క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తారనే భయంతో ఆటోనగర్ లో దాక్కున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీరి వల్ల ఈ ప్రాంతంలో చాలా మందికి కరోనా వైరస్‌ సోకి ఉంటుందనే ఆందోళన  స్థానికుల్లో వ్యక్తమవుతోంది. 

 

గుంటూరు ఆటోనగర్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. గుంటూరు-విజయవాడ రహదారిని ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాన్ని అష్టదిగ్బంధం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో కొందరు కరోనా సోకిన వాళ్లను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే... అప్పటికే ప్రైమరీ, సెకండరీ కాంటక్ట్‌ వల్ల ఈ ప్రాంతంలో చాలా మందికి వైరస్‌ సోకి ఉంటుందనేది స్థానికులు ఆందోళన.

 

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పాజిటివ్ రిపోర్టులు వచ్చిన వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు క్వారంటైన్ భయంతో ఆటోనగర్‌లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల మొదటి వారంలోనే ఆటోనగర్ పరిసరాల్లో  ఎవరికి తెలియకుండా వీరు దాకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, వీళ్లలో కొందరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆఖరి నిమిషంలో కుటుంబ సభ్యులే అధికారులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో ప్రత్యేక అంబులెన్సుల్లో వాళ్లను హాస్పిటల్స్‌కు తరలిస్తున్నారు. వీరికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. దీంతో ఈ ప్రాంతంలో నక్కిన వాళ్లు ఇంకెంత మందికి కరోనాను వ్యాప్తి చేశారనే టెన్షన్‌ స్థానికుల్లో మొదలైంది. 

 

ఆటోనగర్ లో కరోనా కరోనా కేసులు పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అనుమానితులు మకాం వేసిన ప్రాంతాల్లో శానిటైజేషన్‌ చేపట్టారు. రెడ్‌జోన్‌గా ప్రకటించిన ఆటోనగర్‌ నుంచి ఎవరూ బయటకు రాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు. మొత్తానికి కరోనా లక్షణాలున్న వ్యక్తులు గుంటూరు నగరంలో తలదాచుకున్నారన్న వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: