విశాఖ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో  అధికారులు రిలాక్స్ అయ్యారా..? కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక చర్యలు ఎలా వున్నాయి.? జీవీఎంసీ ఏం చెబుతోంది....జనం రియాక్షన్ ఎలా ఉంది. రెడ్ జోన్ సర్వేలపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి.

 

కోవిడ్19ను నియంత్రించడంలో విశాఖజిల్లా యంత్రాంగం సమర్ధంగా పని చేసింది. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు చురుకుగా వ్యవహరించాయి. ఫలితంగా కేసుల సంఖ్య 20కి పరిమితమైంది. జిల్ల్లాలో 8కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు. వీటి పరిధిలో లక్షల మంది జనం.....వేల సంఖ్యలో ఇళ్ళు వున్నాయి. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన జీవీఎంసీ జోన్-4పరిధిలో హైరిస్క్ జోన్లు అధికం. వీటి పరిధిలో వున్న ప్రతీ ఇంటికి వెళ్లి సర్వేలు చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు మూడు దశల్లో వాలంటీర్లు, ఆశావర్కర్లు, జీవీఎంసీ ఆరోగ్య సిబ్బంది ద్వారా ఇంటింటి సర్వే  పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు.

 

కంటెయిన్ మెంట్ ఏరియాల్లో కొంతమంది ప్రజలు మాత్రం అధికారులు ఎలాంటి సర్వేలు చేయించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో అల్లిపురం, ముస్లిం తాటిచెట్లపాలెం, రైల్వే న్యూకాలనీ, గాజువాక సహా జిల్లాలో ఎనిమిది ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. వాలంటీర్లు రెడ్‌జోన్లలో సర్వే సరిగా చేయలేదనే ఆరోపణ బలంగా వుంది. ముఖ్యంగా కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉన్న అక్కయ్యపాలెంలోని కొన్ని వార్డుల్లో కొన్నిచోట్ల  ఇంతవరకు ఒక్కసారి కూడా బ్లీచింగ్‌ పౌడర్‌, హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ సరిగా చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

హాట్ స్పాట్స్ పరిధిలోని వారు ఇతర ప్రాంతాల ప్రజలను కలవడం, ప్రయాణాలు చేయడం నిషేధం. అత్యవసరమైతే తప్ప ఇళ్ళలో నుంచి బయటకు రావొద్దన్న హెచ్చరికలు వున్నాయి. కానీ, కంటైన్మెంట్ ఏరియాలో జనాన్ని కట్టడి చేయడం కష్టంగానే వుంటోంది. ఎన్ని ఆంక్షలు, నిబంధనలు పెట్టినా ప్రజలు మాత్రం బయట తిరుగుతున్నారు. ఉదయం వేళల్లో కంటైన్మెంట్ జోన్ లలో మొబైల్‌ రైతు బజార్లను పంపించడంలో జాప్యం జరగడం పై కూడా ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది.

 

అనుమానిత లక్షణాలు కలిగిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తామని జీవీఎంసీ అధికారులు చెబుతూ వస్తున్నారు. అంతకంటే ముందు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో సర్వే చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: