పదిరోజుల్లో పాజిటివ్ కేసులు నమోదవ్వకపోవడంతో.. విశాఖపై కోవిడ్ పడగనీడ తొలగినట్లేననే సంకేతాలు వస్తున్నాయి. అధికారుల వ్యూహం ఫలించిందని డిశ్చార్జ్ లెక్కలు చెబుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే విశాఖను రాజధాని చేయడానికే.. తక్కువ కేసులు చూపిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

 

రాష్ట్రంలో కొవిడ్‌-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేంద్రం ప్రకటించి న హాట్ స్పాట్ జిల్లాల్లో కరోనా ఉధ్ర్రతికి అడ్డుకట్టపడ్డం లేదు. ఇతర ప్రాంతాల్లో కేసుల తీవ్రత పెరుగుతుంటే... స్టీల్ సిటీలో మాత్రం పరిస్ధితులు అందుకు భిన్నంగా వున్నాయి. ఇప్పటివరకు మొత్తం 20 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.వీటిలో ఈ నెల ఆరో తేదీన నిర్ధారణ అయిందే ఆఖరి కేసు. గడచిన పది రోజుల్లో జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. కరోనా నుంచి కోలుకుని ఇళ్ళకు వెళ్ళిన వారి సంఖ్య 10 కి పెరిగింది. ఐసోలేషన్ వార్డుల్లో వున్న వారిలోనూ వైరల్ లోడ్ బాగా తగ్గింది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో నగర ప్రజల స్వీయనియంత్రణ... అధికారుల వ్యూహాత్మక చర్యలు మంచి ఫలితాలను ఇచ్చినట్టు కనిపిస్తోంది. కేసుల సంఖ్య పెరగకపోగా.. కరోనా బాధితులు సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఇళ్ళకు వెళ్ళడం ప్రజల్లో నెలకొన్న ఆందోళనను బాగా తగ్గించింది. 

 

కరోనా విస్తరించిన తర్వాత విశాఖ సిటీ పరిధిలోనే తొలి కేసు నమోదైంది. మక్కా నుంచి వచ్చిన అల్లిపురం వాసికి పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. మార్చి 17న ఛాతి ఆసుపత్రిలో చేరగా.. కరోనా నిర్ధారణ అయింది. అప్పటికి రాష్ట్రంలో పూర్తిస్ధాయి అలెర్ట్ లేదు. మొదటి కేసు వచ్చిన వెంటనే జిల్లా యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. నగరంలో కంటైన్ మెంట్ జోన్ మాట జనానికి పరిచయం అయిందీ అప్పుడే. రద్దీ ఎక్కువగా వుండే అల్లిపురం ప్రాంతంలో కేసు నమో దవ్వడంతో ఆందోళనలు పెరిగాయి. డబ్ల్యూ.హెచ్.వో. ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రాంతంలో విస్తృతంగా సర్వే నిర్వహించారు అధికారులు. సుమారు 27వేల మం ది ఆరోగ్య పరిస్ధితిని విచారించారు. ఈనేపథ్యంలోనే బాధితుడి భార్యకు పాజిటివ్ రావడంతో హై అలెర్ట్ ప్రకటించారు. 

 

కరోనా విస్తృతి ఫస్ట్ కాంటాక్ట్స్ కే పరిమితం అవ్వడంతో యంత్రాంగం కాస్త స్ధిమితపడింది. ఈ పరిస్ధితుల్లో ఢిల్లీ జమాత్ లింకు లు బయటపడ్డంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. జీవీఎంసీ జోన్4, నర్సీపట్నం
,గాజువాక ప్రాంతాల్లో 9మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో కేసుల తీవ్రత పెరిగిపోతుందనే ఆందోళన రెట్టింపైంది. విశాఖ నడిబొడ్డున వున్న తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, ఎన్.ఏ.డీ పరిధిలోని శాంతినగర్ తో కలిపి 8 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు. వీటి పరిధిలో సుమారు ఏడున్నర లక్షల మంది ఆంక్షల పరిధిలోకి వెళ్ళిపోయారు. కేంద్రం విధించిన లాక్ డౌన్ ను తూ.చ.తప్ప కుండా పాటిస్తే ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడినట్టేనన్న నమ్మకం ఏర్పడింది.

 

గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్ధ పరిధిలో వుంటున్న జనాభా సుమారు 24 లక్షలు. ఈ మధ్య కాలంలో ఇతర దేశాల నుంచి నగరానికి వచ్చిన వారి సంఖ్య 2526. కరోనా పాజిటివ్ కేసు నమోదైన తర్వాత ఇప్పటి వరకూ మూడు దశల్లో సర్వేలు జరిగాయి. నాలుగో విడత సర్వేకు యంత్రాగం సిద్ధమౌతోంది. నగరంలో కరోనా లక్షణాలు వున్నవారు ఎవరైనా ఉన్నారా? అని సిబ్బంది జల్లెడ పట్టి గాలిస్తున్నారు. సుమారు కోటిన్నర రూపాయలతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కరోనా టెస్టింగ్ సెంటర్ ప్రారంభమైంది. దీని సామర్ధ్యం రోజుకి వంద నమూనాలు. పరీక్షల సంఖ్య కూడా పెంచుతున్నారు అధికారులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: